ఉచిత బియ్యం..
విద్యానగర్(కరీంనగర్): రేషన్‌కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యాన్ని కేంద్రం, కిలో బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నా.. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. గతంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మార్పు చేసి బియ్యం రూపాయికి కిలో చొప్పున, పామాయిల్ ప్యాకెట్, గోధుమలు, ఉప్పు, పప్పు, చింతపండు, సబ్బులు అందించాయి. ప్రస్తుత ప్రభుత్వం నిత్యావసర సరుకులు ఇవ్వడం మానేసింది.
పెదవి విరుస్తున్న పేదలు
బియ్యం ఉచితంగా ఇస్తుండగా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఒక్కోసారి నాణ్యతలేమితో ఇస్తుండడంతో బియ్యంపై పేదలే పెదవి విరుస్తూ అయినకాడికి అమ్ముకుని మార్కెట్‌లో మేలు రకాలను కొనుక్కుంటున్నారు.
ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు
పెరిగిన ఇంధన ధరలతో నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వంటనూనెలు 50శాతం పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. రెండేళ్ల కిత్రం ఒక మధ్యతరగతి కుటుంబం ఇంటి సరుకులకు నెలకు రూ.2 వేల నుంచి రూ.3వేలు వెచ్చించే వారు. ప్రస్తుతం రూ.6వేల నుంచి 7వేలు వెచ్చించినా సరిపడా సరుకులు రావడం లేదు. రెండేళ్ల కిత్రం క్వింటాల్ బియ్యం రూ.2,500– 3,000 ఉండగా ప్రస్తుతం రూ.5,000 నుంచి రూ.6,500 పలు కుతోంది. మొన్నటి వరకు కిలో పల్లినూనె రూ.120 ఉండగా ప్రస్తుతం రూ.185 అయింది. పప్పులు, చింతపండు, గోధుమలు, మిర్చి పౌడర్ తదితర వస్తువుల ధరలు మూడింతలు పెరిగాయి. కూరగా యల్లో టమాట కిలో రూ.30 పలుకుతుండగా, మిగతావి కిలో రూ.60కి తక్కువ లేవు.
భారమంతా ప్రజలపైనే..
పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యావసర వస్తువుల ధర లు పెరగడానికి కారణం కాగా, పెరిగిన భారాన్ని ప్రజలపై రుద్దడంతో సామాన్యుడు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. వీటికి తోడు రోగాలతో వైద్యానికి అప్పు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని నిత్యావసర వస్తువుల ధరలను కట్టడి చేయాలని సామాన్యులు కోరుతున్నారు.
నలుగురున్న సామాన్యుడి కుటుంబం నెలవారీ ఖర్చు
నెల ఆదాయం రూ.8వేల–15వేలు
ఇంటి అద్దె రూ.4,500
నిత్యావసర వస్తువులు రూ.3,500
పాలు అరలీటర్ రూ.900
కూరగాయలు రూ.1,000
కరెంట్ బిల్ రూ.450
స్కూల్ ఫీజులు(ఒక్కరికి) రూ.3,000
సెల్ రీచార్జి(ఇద్దరికి) రూ.650
వైద్యం,ఇతర ఖర్చులు రూ.1,000
మొత్తం ఖర్చు రూ.15,000


