కరీంనగర్ అర్బన్: జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతున్నందున్న, ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం, వానాకాలం సాగు, తదుపరి కార్యాచరణ అంశంపై వ్యవసాయ, నీటిపారుదల తదితరశాఖల అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతం ఉందని, ఎల్ నినో ప్రభావం కూడా కనిపిస్తున్నందున ఆరుతడి పంటలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు వంటి పంటల సాగు ఆవశ్యకత తెలియజేయాలని ఆదేశించారు. ఆన్‌లైనలో యూరియా అమ్మకాల ప్రక్రియ కొనసాగుతున్నందున జిల్లాలో ఎరువుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వడ్లను మాత్రమే సాగు చేయాలని, తద్వారా బోనస్ పొందవచ్చని సూచించారు. సదరు రకాలను ప్రతి రైతుకు తెలియజేయాలని అన్నారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మండలాల వారీగా సమీక్షిస్తానని తెలిపారు. అధికారుల సూచనలు రైతులు పాటించాలని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు. వీబిజిరామ్ జి పథకం అమలుకు సరైన ప్రణాళిక రూపొందించి కూలీలకు వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలని తెలిపారు.


