సర్కారు ప్రోత్సాహం.. రైతుల్లో ఉత్సాహం | - | Sakshi
Sakshi News home page

సర్కారు ప్రోత్సాహం.. రైతుల్లో ఉత్సాహం

Jul 10 2026 7:22 AM | Updated on Jul 10 2026 7:22 AM

● ఆయిల్‌పామ్‌ దిగుబడి ప్రారంభం ● ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ● అన్నదాతల్లో ఆనందం

12 టన్నుల దిగుబడి వచ్చింది

స్థిరమైన ఆదాయం

కరీంనగర్‌ రూరల్‌: జిల్లా రైతులకు ఆయిల్‌పామ్‌ తోటలపై అవగాహన లేదు. ప్రభుత్వ ప్రోత్సాహంతో తొలిసారిగా ఆయిల్‌పామ్‌ సాగు చేశారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఎస్సారెస్పీ నీటివిడుదల, వ్యవసాయబావులు, చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా ఉండటంతో వరి మాత్రమే సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగును పెంపొందించాలనే లక్ష్యంతో ఉద్యానశాఖ అధికారులకు మండలాలవారీగా లక్ష్యాన్ని నిర్ధేశించింది. అధికారుల ప్రోత్సాహంతో కరీంనగర్‌తోపాటు మెట్టప్రాంతమైన చొప్పదండి నియోజకవర్గాల్లో ఆయిల్‌పామ్‌పంట సాగు పెరిగింది.

జిల్లావ్యాప్తంగా 2వేల ఎకరాల్లో సాగు

ఉద్యానశాఖ ఆధ్వర్యంలో 2023లో ఆయిల్‌పామ్‌ తోటల సాగు ప్రారంభమైంది. ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ మొక్కలను 90శాతం సబ్సిడీపై పంపిణీ చేసింది. ఒక్కో మొక్కకు రైతులు రూ.20 వెచ్చించారు. అంతేకాకుండా 70నుంచి 90శాతం సబ్సిడీపై ప్రభుత్వం డ్రిప్‌ పరికరాలు, నిర్వహణ ఖర్చు కింద సంవత్సరానికి ఎకరానికి రూ.4200 చొప్పున నాలుగేళ్లు చెల్లించింది. అధికారుల ప్రోత్సహంతో జిల్లాలో మొత్తం 2,468 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్‌ పంటను సాగు చేశారు. వరి,పత్తి పంటల కన్నా ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుంది. మొక్కలకు ఎలాంటి చీడపీడలు ఆశించే అవకాశం లేకపోవడంతో రైతులపై క్రిమి సంహరక మందుల కొనుగోలు భారం తప్పింది.

ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు

జిల్లాలో 2022–23 ఏడాదిలో నాటిన మొక్కలు ప్రస్తుతం కోత దశకు చేరుకున్నాయి. ఒక్కో చెట్టుకు 10 కిలోల నుంచి 25 కిలోల బరువున్న గెలలతో దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం ఎకరానికి 3టన్నుల నుంచి 4టన్నులు, 6సంవత్సరాల అనంతరం కనీసం 10టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖాధికారి స్వాతి తెలిపారు. ఆయిల్‌పామ్‌ 30 ఏళ్ల వరకు ప్రతినెల దిగుబడి వస్తుందని వివరించారు. ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్‌ ద్వారా ఆయిల్‌పామ్‌ గెలలను కొనుగోలు చేస్తున్నారు. వారం రోజుల నుంచి కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లోని గ్రామాల్లో గెలలను అధికారులు కొనుగోలు చేసి సిద్ధిపేటలోని కంపెనీకి తరలిస్తున్నారు. నాలుగేళ్లక్రితం టన్ను ధర రూ.12వేలుండగా ప్రస్తుతం రూ.23,783 చెల్లిస్తున్నారు. గెలలను తీసుకున్న వారం రోజుల్లో రైతుల బ్యాంకుఖాతాల్లో డబ్బులను జమచేస్తున్నారు.

2023 సంవత్సరంలో 5.20 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ మొక్కలను నాటాను. ప్రస్తుతం గెలలు కోతకు వచ్చి దిగుబడి ప్రారంభమైంది. మొదటి విడతగా 12 టన్నులను విక్రయించగా రూ.2,82,984 బ్యాంకు ఖాతాలో జమైనవి.

– మిల్కూరి నరేశ్‌, మల్లాపూర్‌, గంగాధర

ఆయిల్‌పామ్‌ పంట దిగుబడి కొనుగోలుకు కచ్చితమైన మార్కెటింగ్‌ వ్యవస్థ ఉంది. సుమారు 30 ఏళ్లపాటు రైతులకు స్థిరమైన ఆదాయం వస్తోంది. ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకుని రైతులు ఆయిల్‌పామ్‌ సాగుకు ముందుకురావాలి.

– సి.జగన్మోహన్‌రెడ్డి,

జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement