నకిలీ విత్తనాలను గుర్తించడం సులువే
కరీంనగర్ అర్బన్: తొలకరి చినుకులు పలకరించాయి. వానాకాలం సీజన్ ప్రారంభమైంది. దుక్కులు దున్ని భూమిని సిద్ధం చేసిన రైతులు విత్తనాలు వేసేందుకు వేచి చూస్తున్నారు. ఇప్పటికే నకిలీ పత్తి, వరి విత్తనాలు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదే అదనుగా దళారులు మళ్లీ మార్కెట్లోకి ప్రవేశించారు. అమాయక రైతులను మోసం చేయడమే లక్ష్యంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తక్కువ ధరలకు అందిస్తామంటూ నమ్మబలుకుతున్నారు.
దుకాణదారులూ తస్మాత్ జాగ్రత్త
ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు విక్రయించాలి. రైతులకు కచ్చితంగా బిల్లులు అందించాలి. అందులో ప్యాకెట్లపై ముద్రించిన బ్యాచ్ నంబర్ తప్పకుండా రాసివ్వాలి. మండల వ్యవసాయ అధికారి సంతకాలు కలిగి ఉన్న బిల్లు పుస్తకాలను ఉపయోగించాలి. ఏఏ కంపెనీలకు చెందిన ప్యాకెట్లు ఎన్ని కొనుగోలు చేశారో తప్పకుండా రిజిష్టర్‌లో నమోదు చేయాలి. స్టాక్‌బోర్డులను, ధరల పట్టిక స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలి. లాభం ఎక్కువగా ఇస్తామని ఆశ చూపించే ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్ వ్యక్తుల విత్తన ప్యాకెట్లను విక్రయించరాదు. ఇలా చేస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు చట్టరీత్యా చర్యలు తప్పవు.
మాటల గారడి నమ్మొద్దు
గతేడాది వరి విత్తనాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నకిలీ విత్తన సంస్థలు పుట్టుకొచ్చాయి. తక్కువ ధరకు ఇస్తామంటూ నమ్మబలికారు. పొరుగు రాష్ట్రానికి చెందిన దళారులు ఎలాంటి అనుమతి లేకుండా గ్రామాల్లో మిర్చి, పత్తి విత్తనాలు విక్రయించారు. పల్లెల్లోకి వచ్చి పత్తి, మిర్చి విత్తన ప్యాకెట్లు విక్రయించే వారిని నమ్మకూడదు. ప్రభుత్వ అనుమతి పొందిన సీడ్స్ దుకాణాలలో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. బిల్లులు తీసుకోవాలి. ప్యాకెట్లపై ఉన్న బ్యాచ్ నంబర్ బిల్లుపై సరిగా రాశారో లేదో చూసుకోవాలి. పంట పూర్తయ్యేంతవరకు ఈ బిల్లులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.
ఎలాంటి బ్యాచ్ నంబర్ వేయకుండా, బిల్లు ఇవ్వకుండా పత్తి లేదా మిర్చి, వరి విత్తనాలు విక్రయిస్తే అవి నకిలీ విత్తనాలుగా గుర్తుపట్టాలి. ప్రభుత్వ అనుమతి పొందని దుకాణాలలో విత్తనాలు కొనుగోలు చేయకూడదు. గ్రామాల్లోకి వచ్చి విక్రయించేవారి నుంచి నర్సరీలు పెట్టి నారు అమ్మే వారి విత్తనాలు కొనుగోలు చేయకూడదు. డీలరు వద్ద ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీలకు చెందిన విత్తనాలకు బిల్లు తీసుకుని కొనాలి. ఇలా చేస్తే పంట దిగుబడి రాకపోయినా విచారణ జరిపి ఆ కంపెనీలపై చర్యలకు మేం సిఫారసు చేస్తాం. వాటి నుంచి రైతులకు పరిహారం ఇప్పించడానికి వీలవుతుంది.
– రణధీర్‌రెడ్డి, ఏడీఏ, కరీంనగర్


