బీ కేర్‌ఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

బీ కేర్‌ఫుల్‌

May 19 2026 12:16 AM | Updated on May 19 2026 12:16 AM

ఆహారం, పానీయాలు శిక్షణ పద్ధతులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి నీరు ఎక్కువగా తాగాలి

కరీంనగర్‌స్పోర్ట్స్‌: వేసవి సెలవుల నేపథ్యంలో మైదానాల్లో చిన్నారుల సందడి నెలకొంది. ఈనెల 1 నుంచి కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియం, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. కాగా, ఈ ఏడాది భానుడు భగ్గుమంటున్నాడు. శిక్షణ శిబిరాల్లో చిన్నారులు ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

శిక్షణకు ముందే తగినంత నీరు తాగాలి. పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఉన్న పండ్లు తినాలి. ప్రాక్టీస్‌ మధ్యలో ఎలక్ట్రోలైట్‌ పౌడర్‌ వాడాలి. ఖాళీ కడుపుతో ఎండలో క్రీడలు ఆడకూడదు. రోజూ ఆకుకూరలు, కూరగాయలు, మజ్జిగ తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్ల రసాలు తాగాలి. లేత రంగు దుస్తులు ధరించాలి. తలకు క్యాప్‌ ధరించడం మర్చిపోవద్దు. శిక్షణ తర్వాత వెంటనే చన్నీళ్లతో స్నానం చేయొద్దు.

ఉదయం 9 గంటలలోపు శిక్షణ కార్యక్రమాలు ముగించాలి. సాయంత్రం 5 గంటల తర్వాతే మైదానంలో దిగాలి. నీడ ఉన్న ప్రదేశాల్లో వార్మప్‌ చేయాలి. శిక్షణ మధ్యలో విరామ సమయాన్ని పెంచాలి. ఎండ ఎక్కువగా ఉంటే ఇండోర్‌ గేమ్స్‌పై దృష్టి పెట్టాలి. గాలి సరిగ్గా ఆడని ప్రదేశాల్లో సాధన చేయొవద్దు. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే శిక్షణ ఆపేయాలి.కోచ్‌ సూచనలు తప్పకుండా పాటించాలి. కంటినిండా నిద్ర (కనీసం 8 గంటలు) ఉండాలి.

భగ్గుమంటున్న ఎండలు క్రీడా శిక్షణ శిబిరాల్లో జాగ్రత్తలు తప్పనిసరి

కోచ్‌లు, డాక్టర్ల సలహాలు పాటించాలంటున్న నిపుణులు

ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శిక్షణ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులు, క్రీడాకారులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తరచూ నీరు, ఓఆర్‌ఎస్‌, ఎలక్ట్రోలైట్‌ పానీయాలు తీసుకోవాలి. అధిక ఎండలో ఎక్కువసేపు సాధన చేయడం వల్ల డీహైడ్రేషన్‌, హీట్‌ స్ట్రోక్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రం ముదురురంగులో వస్తుంటే మీ శరీరంలో నీరు తగ్గిందని అర్థం. వెంటనే విశ్రాంతి తీసుకోవాలి.

– డాక్టర్‌ వివేక్‌రావు, పిల్లల వైద్య నిపుణుడు

మైదానంలో ఎంత కష్టపడతారో దానికి తగ్గట్టుగా శరీరానికి ఇంధనం అందించాలి. వేసవిలో జంక్‌ ఫుడ్‌, నూనె పదార్థాలు తింటే త్వరగా అలసిపోతారు. ప్రతి క్రీడాకారుడు తమ వెంట వాటర్‌ బాటిల్‌తో పాటు నిమ్మరసం లేదా గ్లూకోజ్‌ నీటిని తప్పనిసరిగా ఉంచుకోవాలి. శిక్షణకు ముందు, మధ్యలోతర్వాత కూడా నీరు తాగుతూ ఉండాలి.

– వేల్పుల సురేందర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement