ఇసుక ట్రాక్టర్‌ బోల్తాపడి డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్‌ బోల్తాపడి డ్రైవర్‌ మృతి

May 19 2026 12:16 AM | Updated on May 19 2026 12:16 AM

కరీంనగర్‌రూరల్‌: పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఇసుక ట్రాక్టర్‌ బోల్తాపడి డ్రైవర్‌ మృతిచెందడం వివాదాస్పదంగా మారింది. కరీంనగర్‌రూరల్‌ ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో గోపాల్‌పూర్‌ చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తూరి చందు ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకుని పంచనామా చేస్తుండగా, సుల్తానాబాద్‌ మండలం గొల్ల పల్లికి చెందిన గున్నాల హరీశ్‌(31) ఇసుక ట్రాక్టర్‌ను యూటర్న్‌ చేసుకుని దుర్శేడ్‌ మీదుగా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ట్రాక్టర్‌ హెడ్‌లైట్లను ఆర్పేసి వేగంగా పోతున్న క్రమంలో దుర్శేడ్‌ శివారులో నేషనల్‌ హైవే బ్రిడ్జి వద్ద అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. డ్రైవర్‌ ఎగిరి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు వెంటనే హరీశ్‌ను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రేమ వివాహం చేసుకున్న హరీశ్‌కు ఇద్దరు చిన్న పిల్లలున్నారు.

న్యాయం చేయాలంటూ రాస్తారోకో

హరీశ్‌ మృతిచెందాడనే సమాచారంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులతో చర్చలు విఫలం కావడంతో న్యాయం చేయాలంటూ మంచిర్యాల చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. హరీశ్‌ మృతికి కారణమైన ఎస్సైని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా హరీశ్‌ ట్రా క్టర్‌పై ఇప్పటికే రెండు కేసులున్నాయని, మరోసారి పోలీసులు పట్టుకుంటే సీజ్‌ చేస్తారనే భయంతో తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement