హనుమాన్‌ జయంతికి పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ జయంతికి పటిష్ట బందోబస్తు

Apr 2 2026 7:23 AM | Updated on Apr 2 2026 7:23 AM

పారక్వాట్‌ గడ్డి మందు నిషేధం

కరీంనగర్‌క్రైం: హనుమాన్‌ చిన్న జయంతికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్‌ ఆలం పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో టౌన్‌ డివిజన్‌ పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గురువారం హనుమాన్‌ చిన్న జయంతి సందర్భంగా నిర్వహించ తలపెట్టిన బైక్‌ ర్యాలీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ర్యాలీ సందర్భంగా సామాన్య ప్రజలు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అవసరమైన ప్రాంతాల్లో ముందస్తుగా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టాలని టౌన్‌ ఏసీపీని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం నిఘా ఉంచాలన్నారు. నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న చీటింగ్‌, ఫోర్జరీ కేసుల పురోగతిపై తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ పక్కా సాక్ష్యాధారాలతో చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ట్రైనీ ఐపీఎస్‌ సోహం సునీల్‌, అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్లు రాంచందర్‌రావు, సృజన్‌రెడ్డి, తిరుమల్‌, ఎస్సైలు భాస్కర్‌రెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు సీజ్‌

కరీంనగర్‌క్రైం: నగరంలో నంబర్‌ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై కరీంనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. బుధవారం ట్రాఫిక్‌ సీఐ సంజీవ్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. నంబర్‌ ప్లేట్లు లేని, నంబర్లు సరిగా కనిపించని, నంబర్‌ ప్లేట్లను ట్యాంపరింగ్‌ చేసిన 70 ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్‌ చేశారు. పట్టుబడిన వాహనాలకు నిబంధనల ప్రకారం వెంటనే నంబర్‌ ప్లేట్లు ఏర్పాటు చేయించి, సంబంధిత వాహనదారులపై భారీ జరిమానా విధించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, నంబర్లపై స్టిక్కర్లు వేయడం, నంబర్లను మార్చడం చట్టరీత్యా నేరమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు నడిపే వాహనాలకు నంబర్‌ ప్లేట్లు ఉన్నాయో లేదో గమనించాలన్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో సామాజిక శిక్ష

ఇటీవల మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన శివాజీనగర్‌కు చెందిన వ్యక్తిని పోలీ సులకు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈనేపథ్యంలో అతడికి రూ.4 వేల జరిమానాతో పాటు మూడు రోజులు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశించింది.

మీ సేవా కేంద్రాల్లో ధరల పెంపు

కరీంనగర్‌రూరల్‌: మీ సేవా కేంద్రాల్లో సర్వీసు ధరలు పెంచారు. అన్నీ సర్వీసులపై దాదాపు 50శాతం మేరకు ధరలను పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 208 మీ సేవా కేంద్రాలుండగా గతంలో కనీస చార్జీలు రూ.45 ఉంటే ప్రస్తుతం రూ.62 నుంచి రూ.80 వరకు పెంచారు. పెంచిన ధరల పట్టికను దుర్శేడ్‌లోని మీ సేవా కేంద్రంలో 4వ డివిజన్‌ కార్పొరేటర్‌ భూపతి రవీందర్‌ మీ సేవా కేంద్రం నిర్వాహకుడు వేముల అశోక్‌తో కలిసి విడుదల చేశారు. ఏ కేటగిరిలోని జనన ధ్రువీకరణపత్రం రూ.62 కాగా, బీ కేటగిరిలోని ఆదాయం, కులం, స్థానిక సర్టిఫికెట్లకు రూ.80 పెంచారు. అయితే సేవా రుసుం పెంచిన ప్రభుత్వం కేంద్రాల నిర్వాహకులకు మాత్రం కమీషన్‌ పెంచకపోవడం సమంజసం కాదని మీ సేవా కేంద్రాల సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల అశోక్‌ తెలిపారు. ప్రభుత్వం వెంటనే కమీషన్‌ పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

కరీంనగర్‌ అర్బన్‌: పారక్వాట్‌ గడ్డి మందును ప్రభుత్వం నిషేధించిందని, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. నిల్వ, పంపిణీ, తయారీని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. ఇకపై పారక్వాట్‌ గడ్డి మందు విక్రయాలు ఉండవని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement