కరీంనగర్‌కల్చరల్: మహనీయుల జయంతిని వైభవంగా జరుపుకుందామని చొప్పదండి ఎమ్మెల్యే, బాబు జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈనెల 5న జగ్జీవన్‌రామ్, 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాలు విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మహనీయుల విగ్రహాల వద్ద అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈనెల 2న జరిగే గ్రామసభల్లో మహనీయుల జయంతి ఉత్సవాల విజయవంతం కోసం ప్రజలకు వివరించాలన్నారు. ఇందుకు అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ, పాఠశాలల్లో మహనీయుల జీవిత చరిత్రపై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. వారి జీవిత చరిత్రపై వీడియోలు ప్రదర్శిస్తామని వివరించారు. గ్రామాలు, పట్టణాల్లో మహనీయుల విగ్రహాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతామని వివరించారు. తిమ్మాపూర్‌లో విగ్రహాల ప్రారంభానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దళిత సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్తామన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, నగరపాలక కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు, టౌన్ ఏసీపీ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.


