కరీంనగర్: గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కీలకమని, బాలికలకు తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకాలు ఇప్పించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు రూ.4వేల ఖరీదైన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. 14వ పుట్టిన రోజు జరుపుకొని 15వ పుట్టినరోజు ఇంకా చేసుకోని వారు ఈ టీకాలు వేసుకునేందుకు అర్హులని వివరించారు. ఈ టీకాలతో ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండవని, ఇతర టీకాల మాదిరిగా కొందరిలో ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి, వాపు, జ్వరం ఉండవచ్చని, ఇవన్నీ రెండుమూడు రోజుల్లో తగ్గిపోతాయన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. అర్హులైన బాలికలకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ ఇప్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.


