బాల్యాన్ని చిదిమేస్తే చట్టం ఊరుకోదు
మానకొండూర్: బాలల హక్కులకు భంగం కలిగిస్తే చట్టం తన ఉక్కుపాదాన్ని మోపుతుందని, పిల్లల రక్షణకు చట్టమే ఒక అజేయమైన కవచమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు పెరుక రంగయ్య, చిట్టి చంద్రప్రకాశ్ స్పష్టం చేశారు. బుధవారం మానకొండూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహమనే మహమ్మారి ఆడపిల్లల భవిష్యత్తును చిదిమేస్తుందన్నారు. 2006 బాల్య వివాహ నిషేధ చట్టం ద్వారా అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా నిర్మూలనతోపాటు నేటి తరాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల ముప్పు నుంచి ఎలా బయటపడాలో వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధి కిరణ్‌కుమార్, ప్యానల్ అడ్వకేట్లు యూవీఆర్ కృష్ణ, బలుసుల శాంతికుమార్, తిరుమణి అశ్విని, జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది దుంపేటి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీకి ప్రత్యేక క్యాంపులు
కరీంనగర్ అర్బన్: రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి కోరారు. జిల్లాలో 2,09,450 రైతులకు గానూ 1,21,814 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్నారని వివరించారు. మిగిలిన 87,636 రైతులు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకునేందుకు ఈనెల 19 నుంచి ప్రత్యేక క్యాంపుల ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారులు, మీసేవ సెంటర్ల ద్వారా నమోదు చేస్తారని తెలిపారు. జిల్లాలోని రైతులు 28 లోగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని సూచించారు.
అధిక ధరలు వసూలు చేయొద్దు
చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని ఆయా గ్రామాల్లో గల ఎరువుల పంపిణీ డీలర్లు యూరియా బస్తాకు ప్రభుత్వ రేటు రూ.267కన్నా ఎక్కువ వసూలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి మల్లేశం అన్నారు. ఈనెల 16న ‘సాక్షి’లో ‘యూరియా యాప్ తిప్పలు’ అనే కథనం ప్రచురితమైంది. స్పందించిన ఏవో ప్రైవేటు, ప్రభుత్వ ఎరువుల డీలర్లు స్టాక్ వచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో పెట్టినా, ఏ ఒక్క రైతు నుంచి రూ.267 కన్నా ఎక్కువగా తీసుకుంటే 21రోజుల పాటు సేల్స్‌ను నిలిపివేస్తామని హెచ్చరించారు.
దళితులకు వడ్డీ లేని రుణాలివ్వాలి
కరీంనగర్ టౌన్: ప్రభుత్వం దళితులకు వడ్డీ లేని రుణాలివ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి దేవుని సతీశ్‌మాదిగ ప్రభుత్వాలనికి విజ్ఞప్తి చేశారు. బుధవారం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో దళిత సంఘాల నాయకులతో మేధోమథన సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్‌ఎస్ దళితులను, వారి భవిష్యత్తును నిలువునా ముంచిందని ఆరోపించారు. దళిత బంధు పేరుతో ఇంటికి రూ.10లక్షలిస్తామని చెప్పి ఊరికొకరికిచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. దళిత ఆర్థిక అభివృద్ధి మండలి కరీంనగర్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా సముద్రాల లక్ష్మణ్‌ను నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు గొర్రె రాజన్న, పూసపాటి శ్రీనివాస్, మహంకాళి రామచందర్, సారస్వ, రూప, డీసీసీ కార్యదర్శి లక్ష్మణ్, సత్యరాజు వర్మ, సిరిసిల్ల రాజు, కొత్తూరు రమేశ్ పాల్గొన్నారు.
బాల్యాన్ని చిదిమేస్తే చట్టం ఊరుకోదు


