జిమ్నాస్టిక్స్ పోటీలు
కరీంనగర్ వేదికగా
● 20 నుంచి 22 వరకు నిర్వహణ
● 16 జిల్లాల నుంచి క్రీడాకారుల రాక
కరీంనగర్‌స్పోర్ట్స్: జిమ్నాస్టిక్స్ కేవలం శారీరక వ్యాయామమే కాదు క్రమశిక్షణ, సమతుల్యత, ధైర్యం, ఏకాగ్రతల సమ్మేళనం. చిన్నవయసులోనే క్రీడాకారుల్లో ప్రతిభ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సబ్ జూనియర్, జూనియర్ బాల బాలికల విభాగాల్లో జరుగనున్న పోటీలు భవిష్యత్ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు బాటలు వేయనున్నాయి. ఈనెల 20 నుంచి 22 వరకు కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల వేదికగా రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలు నిర్వహిస్తారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని పరీక్షించే ఈ పోటీలు భవిష్యత్ జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేసే దిశగా కీలకంగా మారనున్నాయి.
మరోసారి అవకాశం..
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు నిలయమైన కరీంనగర్ జిల్లా.. మరోసారి క్రీడా ప్రపంచంలో తన ప్రత్యేకత చాటుకోబోతోంది. రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల నిర్వహణకు కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల సిద్ధమవుతోంది. సీఎం కప్–2025 సెకండ్ ఎడిషన్ రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలకు ఈసారి కరీంనగర్ ఆతిథ్యమివ్వనుండగా గతేడాది జూడో పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. ఈసారి జిమ్నాస్టిక్స్ పోటీలతో సరికొత్త క్రీడావాతావరణం సృష్టించబోతోంది.
ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్‌లో పోటీలు
రెండు విభాగాల్లో చేపట్టే పోటీలు ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ పద్ధతిన ఉంటాయి. బాలురకు ఫ్లోర్ ఎక్సర్‌సైజ్, పామ్మాల్, రింగ్స్, టేబుల్‌వాల్ట్, పార్లర్‌బార్, హారిజంటల్ బార్, బాలికలకు టేబుల్ వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్, అన్విన్ బార్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ అంశాల్లో పోటీలు ఉంటాయి.
250 మంది క్రీడాకారులు.. 72 పతకాలు
రాష్ట్రంలోని 16 జిల్లాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్‌లు, మేనేజర్‌లు, రెఫరీలు హాజరుకానున్నారు. అండర్ – 12 బాలికలు, అండర్ – 14 బాలబాలికలు, అండర్ – 15 బాలికలు, అండర్ – 17 బాలురకు పోటీలు ఉంటాయి. 24 బంగారు, 24 రజత, 24 కాంస్య పతకాలకు పోటీలు జరుగనున్నాయి.
జిమ్నాస్టిక్స్ పోటీలు
జిమ్నాస్టిక్స్ పోటీలు


