కారుణ్యమా.. కనికరించవా?
సింగరేణిలో కారుణ్య నియామకాలు
● 11 నెలలుగా నిలిచిన నియామకాలు
● ఆందోళనలో సింగరేణి కార్మికులు
గోదావరిఖని: కారుణ్య నియామకాలు లేక కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతీనెల చేపట్టాల్సిన మెడికల్ బోర్డులు పత్తాలేకుండా పోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు ద్వారా ఉద్యోగాలు సాధించిన యువతకు సీఎం రేవంత్‌రెడ్డితో నియామక పత్రాలు ఇప్పించింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్టిఫికెట్లు అందజేయడం ద్వారా సీఎం పునరుద్ఘాటించినట్లయ్యింది. కొద్దినెలల పాటు మెడికల్ బోర్డు సజావుగానే సాగినా.. గతేడాది మార్చిలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. 11 నెలలుగా కార్మికులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు.
కార్మికులకు నిరాశ..
తమ జీవితాన్ని సింగరేణికి అర్పించి ఆ తర్వాత తమ పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తామని ఆశపడిన కార్మికులకు మెడికల్ బోర్డులేక నిరాశేమిగులుతోంది. సర్వీస్‌కు రెండేళ్ల ముందు మెడికల్‌బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీనెలలో రెండుసార్లు జరగాల్సి మెడికల్ బోర్డు ఇప్పటివరకు ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో తమ పిల్లల వయసు పెరిగిపోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
18ఏళ్ల క్రితం అంకురార్పణ
సింగరేణిలో 2018 మార్చి 9న కారుణ్య నియామకాల పేరిట మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదలచేశారు. ఏప్రిల్‌లో మెడికల్‌బోర్డు ఏర్పాటు చేశారు. 18ఏళ్లపాటు రెగ్యులర్‌గా ఈ ప్రక్రియ సాగింది. గతేడాది నిలిచిపోవడంతో సుమారు 2వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.
హయ్యర్ సెంటర్ బోర్డుతో కానరాని ఫలితం
సింగరేణిలో అనారోగ్య సమస్యలతో మెడికల్‌బోర్డుకు దరఖాస్తు చేసుకున్న 55 మందిని హయ్యర్ మెడికల్ బోర్డుకు రెఫరల్ చేశారు. వీరి రిపోర్టుల ప్రకారం హయ్యర్ మెడికల్ బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. 55 మందిలో ఒకరు గైర్హాజర్ కాగా ఐదుగురినే మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. మిగతా వారిని ఫిట్‌ఫర్ సేమ్‌జాబ్, సర్ఫేస్ ఉద్యోగాల్లో సర్దుబాటు చేశారు.
అడ్వయిజరీ బోర్డులోనూ అన్యాయమే
విధి నిర్వహణలో అనారోగ్య సమస్యలతో మెడికల్‌బోర్డుకు దరఖాస్తు చేసుకున్న 229 మందికి అన్యాయం జరిగిందని వాపోతున్నారు. అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించడం కష్టమని సింగరేణి డాక్టర్లు నిర్ధారించగా మెడికల్‌బోర్డుకు పంపించారు. వీరిలో కేవలం 24మందినే మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి మిగతా వారిని ఫిట్‌ఫర్ సేమ్ జాబ్, సర్ఫేస్‌లో ఉద్యోగాలు చేయాలని బోర్డు సభ్యులు సూచించారు.
ఇక కారుణ్య నియామకాలు ఉండవా?
సింగరేణిలో కారుణ్య నియామకాలు ఉండవా? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 7వేలమంది అదనంగా ఉన్నారని యాజమాన్యం చెప్పడాన్ని బట్టిచూస్తే వీటికి కావాలనే బ్రేక్‌వేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవ తీసుకుని కారుణ్య నియామక ప్రక్రియ కొనసాగించాలని యువత కోరుతోంది.
ఏడాది నియామకాలు
2018(ఏప్రిల్) 1,663
2019 2,998
2020 1,661
2021 2,111
2022 1,326
2023 1,060
2024 1,304
2025 377


