రైల్వే సామగ్రి చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రైల్వే సామగ్రి చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి నోటీసులు జారీ చేసినట్లు సీఐ చటర్జీ బుధవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వెంకిపల్లికి చెందిన బండి కుమార్, బండి సతీశ్ జనవరి 26న హసన్‌పర్తి రైల్వే స్టేషన్ వద్ద రూ.20,000 విలువైన ఎఫ్‌డీఎంఎస్ బాక్స్‌లు, 45 కాపర్ స్ట్రిప్స్ ఎత్తుకెళ్లారు. అలాగే, ఈ నెల 13,14వ తేదీల్లో బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ ఆర్వోబీ వద్ద రూ.10 వేల విలువైన ట్రాన్స్‌ఫార్మర్ కాయల్, రూ.7 వేల విలువైన కాపర్ పట్టీలను అపహరించారు. అనంతరం ఈ సామగ్రిని హైదరాబాద్ బేగంబజార్‌లో ఎం.డి.యూనిస్ ఖాన్‌కు విక్రయించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టి మంగళవారం అర్ధరాత్రి బిజిగిరి షరీఫ్ సిగ్నల్ సమీపంలో నిందితులను పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో రైల్వే సామగ్రిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే, కొనుగోలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. సీఐబీ సికింద్రాబాద్ ఇన్‌స్పెక్టర్ బీఎన్.సింగ్, ఏఎస్సై రాంబాబు, హెడ్‌కానిస్టేబుల్ రమేశ్, కానిస్టేబుల్ మనోజ్ పాల్గొన్నారు.
వివరాలు వెల్లడించిన కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ చటర్జీ


