ఆదర్శ నగరంగా కరీంనగర్
కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. బుధవారం నగరంలోని 66వ డివిజన్‌లో రూ.13.5లక్షలతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతతో పని చేస్తామన్నారు. డివిజన్ల సమస్యల పరిష్కారానికి వారంలో ఒకరోజు డివిజన్‌లో పర్యటిస్తానని వెల్లడించారు. నగర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసే ఆలోచనతో ఉన్నామని, గతం కన్నా మెరుగైన స్థితికి నగరాన్ని చేరుస్తామన్నారు. 66 డివిజన్లలో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామని, రోడ్లు, డ్రైనేజీల సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని అన్నారు. విలీన గ్రామాల సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వేసవి దృష్ట్యా ఏ డివిజన్‌లోనూ తాగునీటి కొరత రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్లు వంగల పవన్, గుగ్గిలపు మంజుల రమేశ్, సోమిడి వేణుప్రసాద్, బండ రమణారెడ్డి, కేపీ చంద్ర, తాటి ప్రభావతి, స్థానికులు భగవాన్ కార్వా, విక్కీ, డి.రమేశ్, పి.శ్రీనివాస్, జ్యోతి, రవి, సురేశ్, చిన్న, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


