రాజీనామాకు సిద్ధపడ్డ ‘వాసాల’!
కరీంనగర్ : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన వాసాల రమేశ్‌కు మేయర్ పీఠం దక్కినట్లే దక్కి చిక్కకుండా పోయింది. బీజేపీ కార్పొరేటర్లు, మద్దతు పలికిన స్వతంత్ర కార్పొరేటర్లు ఏకగ్రీవంగా రమేశ్ పేరును ప్రతిపాదించినా.. చివరినిమిషంలో చేజారినట్లు సమాచారం. కరీంనగర్ ప్రాంతంలో సీనియర్ నేత అయిన వాసాల రమేశ్ ఈసారి మేయర్ రేసులో బీజేపీ నుంచి ముందు వరుసలో ఉన్నారు. ఈయన కొత్తపల్లి సర్పంచ్‌గా, కరీంనగర్ ఎంపీపీగా వివిధ పదవులు నిర్వర్తించారు. 2019లో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ కావడమే తరువాయి అన్న సందర్భంలో, రాత్రికి రాత్రే ఆయన పదవి చేజారిపోయింది. ఆ తర్వాత బీజేపీలో చేరిన రమేశ్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. కొత్తపల్లి నగరపాలకసంస్థలో విలీనం కావడం, మేయర్ బీసీ జనరల్‌కు రిజర్వ్ అవడం, బీజేపీకి అధిక అవకాశం ఉండడంతో రమేశ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఫలితాల అనంతరం కార్పొరేటర్ల క్యాంప్‌లోనూ రమేశ్ పేరునే ఎక్కువమంది కార్పొరేటర్లు ప్రతిపాదించినట్లు సమాచారం. కానీ.. రాత్రికి రాత్రే అనూహ్యంగా రమేశ్‌కు మేయర్ రాకుండా పోయిందని ఆయన అనుచరులు మండిపడుతున్నారు.
రాజీనామాకు సిద్ధం
మేయర్ వ్యవహారంలో తీవ్ర మనస్థాపానికి గురైన రమేశ్ తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దపడ్డారు. మంగళవారం పద్మశాలి సంఘం నేతలు ఆయనతో భేటీ అయ్యారు. తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించగా, సంఘం నేతలు వారించినట్లు సమాచారం.
కరీంనగర్: బీజేపీ మెజారిటీ 30 స్థానాలు గెలిచినా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. మంగళవారం ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 స్థానాలను గెలిచి పీఠం దక్కించుకునేందుకు నలుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల తీర్పును అపహాస్యం చేసే ప్రయత్నం చేశారన్నారు. మిగతా పార్టీల్లో గెలిచిన సభ్యులను ఎన్నో ప్రలోభాలకు గురి చేసి బీజేపీకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం ప్రజలంతా చూశారన్నారు. మేయర్‌తో సహా పాలకవర్గం మొత్తం ప్రజల సేవలో ఉంటామని స్పష్టంచేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బీజేపీ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాజీవ్‌పార్కు, వేంకటేశ్వర దేవాలయం, రాంనగర్, పెద్దపోల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏఈ స్నేహ తివారి తెలిపారు.
క్షేత్రస్థాయి పాఠాలు ముఖ్యం
కరీంనగర్ అర్బన్: పశువైద్యాధికారులకు తరగతి గది పాఠాలతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులు ముఖ్యమని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.నల్ల లింగారెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్థక శిక్షణ కేంద్రంలో నూతన పశువైద్యాధికారులకు 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కళాశాల విద్యకు అదనంగా క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అవసరముంటుందని వివరించారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన పశువైద్యాధికారులకు మూడో విడత శిక్షణనిస్తున్నామని వెల్లడించారు. సహాయ సంచాలకులు డా.ఎ.వినోద్‌కుమార్, జిల్లా పశువైద్య శాల సహాయ సంచాలకులు డా.రామస్వామి, జిల్లా కార్యాలయ పర్యవేక్షకులు గూడ ప్రభాకర్‌రెడ్డి, శిక్షణ కేంద్రం అధ్యాపక సిబ్బంది డా.ఎం.కోటేశ్వర్‌రావు, డా.దివ్య, డా.సాయిచైతన్య పాల్గొన్నారు.
రాజీనామాకు సిద్ధపడ్డ ‘వాసాల’!
రాజీనామాకు సిద్ధపడ్డ ‘వాసాల’!


