కార్పొరేట్ వల!
కరీంనగర్‌టౌన్: పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. కాగా, అప్పుడే కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్ల హడావుడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల నుంచి 14,670 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో ఇంటర్ ప్రవేశాలకు కార్పొరేట్, చిన్నాచితకా ప్రైవే టు కాలేజీలు విద్యార్థులను చేర్పించుకునేందుకు అప్పుడే వేట మొదలుపెట్టాయి. కళాశాలల్లో పని చేసే లెక్చరర్లకు, ఇతర సిబ్బందికి కమీషన్ల ఆశ చూ పి అడ్మిషన్ల ప్రక్రియను మొదలుపెట్టాయి. ముందుగా అడ్మిషన్లు తీసుకుంటే ఫీజులో రాయితీ అంటూ ఆశ చూపడం, తమ కాలేజీల్లో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నీట్ లాంటి కోచింగ్‌లు, హాస్టల్ వసతి అని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు.
డబ్బులిచ్చి డేటా సేకరణ
పదోతరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల డే టాను ఆయా స్కూళ్ల నుంచి సేకరించిన కార్పొరేట్ యాజమాన్యాలు ఇంటర్ అడ్మిషన్ల కోసం ముంద స్తు చర్యలు చేపట్టాయి. అడ్మిషన్లు చేయించిన ఏజెంట్లకు కమీషన్, వేతనాలు చెల్లిస్తుండడంతో డబ్బుకు ఆశపడి వారు విద్యార్థులను ఆయా కళాశాలల్లో చే ర్పించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. విద్యార్థులకు లేదంటే వారి తల్లిదండ్రులకు ఏజెంట్లు ఫోన్ చేసి, ఇంటర్‌లో కోరిన కోర్సులో సీటు ఇప్పిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. పదో తరగతి ఫలితాలు రాకముందే అడ్మిషన్ తీసుకుంటే తక్కువ ఫీజు ఉంటందని ఆ తర్వాత ఫీజులు పెరుగుతాయని, ముందుగానే సీటు రిజర్వ్ చేసుకోకుంటే తర్వాత కోరిన బ్రాంచ్‌లో సీటు దొరకదని బెదరగొడుతున్నారు. దీంతో ఫలితాలు వచ్చాక ఎలాగో కార్పొరేట్ కళాశాలలోనే చేర్పిస్తాం కదా అనే ఉద్దేశంతో అడ్మిషన్ ఆఫర్ల వలలో తల్లిదండ్రులు చిక్కుతున్నారు.
రంగంలోకి లెక్చరర్లు, పీఆర్‌వోలు
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యం ఫోన్లు రావడంతో ఇదేం మోతరా బాబు అంటూ వాపోతున్నారు. ఎవరైనా తల్లిదండ్రులు పరీక్షల ఫలితాలు రాకముందే ఎలా చేర్పించాలంటూ ప్రశ్నిస్తే.. ‘మీ పిల్లలు బాగానే చదువుతారు’ అని తమకు సమాచారం ఉందని, తప్పకుండా పాస్ అవుతారని చెబుతూ అవసరమైతే స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులతో మాట్లాడిస్తున్నారు. ఒకవేళ పాస్ కాకుంటే చెల్లించిన డబ్బు తిరిగి ఇస్తామంటూ హామీలిస్తున్నారు. ఇలా ఇంటర్ అడ్మిషన్ల కోసం ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉపాధ్యాయులు, ఆర్‌ఎంపీ డాక్టర్లను రంగంలోకి దించి ఒక్క విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు కట్టిస్తే పదిశాతం డబ్బు ముట్టజెప్పేందుకు పీఆర్‌వోలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం.
అప్రమత్తతే ముఖ్యం
తల్లిదండ్రులు తొందర పడి పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కాలేజీల్లో చేరితే తర్వాత ఎవరూ పట్టించుకోరని పేర్కొంటున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించే ముందు విద్యార్థుల అభిప్రాయాలతో పాటు ఆ కాలేజీలో విద్యాబోధన చేస్తున్న వారి ఆనుభవం, అక్కడి సీనియర్, పూర్వవిద్యార్థులను అడిగి తెలుసుకోవాలి. హాస్టల్‌లో ఉంచితే వసతులపై ఆరా తీసిన తర్వాతే అడ్మిషన్‌కు మొగ్గు చూపాలి. తమ విద్యవ్యాపారం కోసం నిత్యం పుస్తకమే ప్రపంచంగా మార్చే కళాశాలలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి వాటిలో చేర్పిస్తే విద్యార్థి తీవ్ర ఒత్తిడికి గురై ఇబ్బందులు ఎద్కురొనే పరిస్థితులు లేకపోలేదు. అందుకని తొందరపాటు చర్యలతో కార్పొరేట్ మాయలో పడి విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు కలగకుండా తల్లిదండ్రులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.


