జవాబుదారీతనమే ఆర్టీఐ లక్ష్యం
రాజన్నా.. శరణుశరణు!
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల–కోనాపూర్‌లోని శ్రీదుబ్బరాజేశ్వరస్వామి ఆలయం భక్తజన సందోహంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం రథోత్సవం నిర్వహించారు. జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో అనూష, ఆలయ ఫౌండర్ చైర్మన్ పొరండ్ల శంకరయ్య, సర్పంచులు ఆకుల రమేశ్, కొలపాక రాధ పాల్గొన్నారు. – జగిత్యాలరూరల్
కరీంనగర్ అర్బన్: అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఆర్టీఐ చట్టం దోహదపడుతుందని, దరఖాస్తుదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు భోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ.శ్రీనివాసరావు, మోసినాపర్వీన్, దేశాల బోపాల్ తెలిపారు. కరీంనగర్‌లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. 2025 మే 14న కమిషనర్లుగా తాము బాధ్యత తీసుకున్న సమయంలో 17,808 రెండో అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, 8 నెలల్లో ఇప్పటివరకు 15 జిల్లాల్లో పర్యటించి 9వేల అప్పీళ్లు పరిష్కరించామని, ఇంత త్వరగా పరిష్కరించడం దేశంలోనే మొదటిసారని పేర్కొన్నారు. 13 శాఖల్లో కేసుల సంఖ్య జీరోకి తెచ్చామని, సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో పర్యటించి వీలైనంత త్వరగా పెండింగ్ కేసులు పరిష్కరిస్తామన్నారు. అర్జీదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని తెలిపారు. పీఐవోలు, అప్పిలేట్ అధికారులకు అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టంపై వివరించారు. దరఖాస్తుదారు కోరిన సమాచారం ఇవ్వడం ప్రభుత్వ అధికారుల బాధ్యతని పేర్కొన్నారు. సెక్షన్ 20ప్రకారం దరఖాస్తుదారునికి ఎలాంటి ప్రత్యుత్తరమూ ఇవ్వకుంటే సంబంధిత అధికారికి రోజుకు రూ.250 అపరాధ రుసుం, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. దరఖాస్తుదారుడు కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే అధికారులే కమిషన్ ముందు హాజరుకావాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, సంస్థలో ఆర్టీఐ కోసం ఒక రోజు కేటాయించి దరఖాస్తులన్నిటినీ పరిష్కరించాలని, కార్యాలయాల్లో ఫోర్ 4(1)బీ సమాచారం ఎప్పుడూ ప్రదర్శించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు అశ్వినితానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, అడిషనల్ డీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు.
జవాబుదారీతనమే ఆర్టీఐ లక్ష్యం


