ఏఐఎఫ్‌బీ కార్పొరేటర్లకు విప్ జారీ
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ విపుల సాయిజ్యోతి, 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామలకు విప్ జారీ చేయడం జరిగిందని ఏఐఎఫ్‌బీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి తేజ్‌దీప్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి బండారి శేఖర్‌తో కలిసి ఆదివారం మాట్లాడారు. ఏఐఎఫ్‌బీ బీఫాంపై గెలిచిన ఇద్దరిలో 15వ డివిజన్ కార్పొరేటర్ సాయిజ్యోతిని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ బీజేపీలో చేర్చుకోవడం సిగ్గుచేటు అన్నా రు. మేయర్ సీటుకోసం బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీకి మేయర్‌ను ఎన్నుకోవడానికి పూర్తిస్థాయిలో కార్పొరేటర్లు లేరని, ఫార్వర్డ్ బ్లాక్, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని కిడ్నాప్ చేసి పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. ఇప్పటివరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎవరికి మద్దతివ్వాలో అధికారికంగా ప్రకటించలేదని, తమ పార్టీ బీఫాంపై గెలిచి ఇతర పార్టీలకు వెళ్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము ఎవరికి మద్దతు ఇవ్వాలో సోమవారం ఉదయం 10గంటల వరకు నిర్ణయిస్తామని తెలిపారు.


