ఆఫీసు కోసం అన్వేషణ
సర్.. తూనికలు, కొలతలశాఖ కార్యాలయమెక్కడా? అంటూ కలెక్టరేట్‌కు వచ్చిన సతీశ్ ఎదురైన వారిని అడగటం, సర్.. డీపీవో కార్యాలయం ఎక్కడా ఎవరిని అడిగినా చెప్పడం లేదు. జర మీరైనా చెప్పరా.. అంటూ మానస ఆరా తీయడం.. వీరిద్దరే కాదు నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు కార్యాలయాల కోసం అన్వేషిస్తుంచడం నిత్యకృత్యం. కలెక్టరేట్ ప్రధాన ద్వారంలో ఉన్న పాతకాలపు లేఔట్‌ను నమ్ముకుని అక్కడికి వెళితే ఆ ఆఫీసే ఉండదు. గత కొన్నేళ్లుగా ఇదీ ప్రజల పరిస్థితి. జిల్లా నలుములల నుంచి కలెక్టరేట్‌కు వచ్చేవారు ఎదుర్కొంటున్న సమస్య.
దశాబ్దాల క్రితం నాటి లేఔట్
కలెక్టరేట్
కరీంనగర్ అర్బన్: కలెక్టరేట్ పద్మవ్యూహాన్ని మరిపిస్తోంది. ప్రజలకు పరిపాలన చేరువ కావాలని, ప్రతి కుటుంబం వివరాలు తెలిసేలా అవగాహన ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పలు సమావేశాల్లోనూ వెల్లడించారు. కానీ ప్రజలకు పాలన చేరువవడం అటుంచితే కార్యాలయాలు ఎక్కడన్నది తెలియని అయోమయ పరిస్థితి జిల్లావాసులది. కలెక్టరేట్‌లో పాతకాలపు ప్రచారబోర్డులు ముక్కున వేలేసుకునేలా చేస్తుండగా గతంలో ఏర్పాటు చేసిన లేఔట్ గందరగోళానికి గురి చేస్తోంది. రెండంతస్తుల్లో కలెక్టరేట్ ఉండగా ప్రధాన ద్వారంలో ఉన్న లేఔట్ ప్రకారం కార్యాలయాలే లేవు. ఇదే విషయాన్ని అధికారుల వద్ద ప్రస్తావిస్తే కూల్చే కలెక్టరేట్ కదా అని దాటవేత మాటలు. మరి అలాంటప్పుడు నాలుగు రోజులు ఉండే కార్యాలయం కోసం మరమ్మతుల పేరిట రూ.లక్షలు వృథా చేయడమెందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పాత కాలపు ప్రచారబోర్డులు
కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తుకు వెళ్తే చాలు గోడలపై ప్రభుత్వ పథకాల ప్రచార బోర్డులు దర్శనమిస్తుంటాయి. పథకాల తీరు తెన్నులు మారగా ముక్కున వేలేసుకునేలా వివరాలున్నా అధికారుల కళ్లకు కనిపించకపోవడం విడ్డూరం. వివిథ పథకాలకు సంబంధించి నిబంధనలు మారగా కొన్ని పథకాలే లేవు. ఈ క్రమంలో అవే ప్రచార బోర్డులు దశాబ్దాలుగా దర్శనమిస్తున్నాయి. చిన్న విషయమే కానీ ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ప్రజలకు ప్రహసనంగా మారుతోంది. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం క్రమంలో కలెక్టరేట్ సగ భాగం కూల్చగా హెచ్చు కార్యాలయాలు నగరంలోని పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. కలెక్టరేట్ నిర్మాణం బిల్లులు రాక ఆగుతూ సా..గుతుండగా ప్రారంభం ఎప్పుడనేది అధికారులకే తెలియని పరిస్థితి. సదరు సమీకృత భవనం ప్రారంభమైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడప్పుడే ప్రారంభమయ్యేలా లేదు. గత ప్రభుత్వం 6 నెలల్లో పూర్తి చేయాలని నిధులు విడుదల చేయగా ఏళ్ల తరబడి సా..గుతునే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అయోమయానికి గురి కాకుండా కలెక్టరేట్ ప్రధాన ద్వారం, గేట్ల వద్ద లేఔట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అత్యవసరం. ఏ ఏ కార్యాలయాలు ఎక్కడెక్కడున్నాయో స్పష్టంగా తెలిసేలా సమాచారాన్ని రూపొందిస్తే వేలమందికి ప్రయోజనం. ఇక పాత కాలపు ప్రభుత్వ పథకాల బోర్డులను తొలగించి ప్రస్తుత పథకాలను ప్రచారం చేసేలా చర్యలు చేపట్టాలి.
ఆఫీసు కోసం అన్వేషణ


