తనిఖీలు చేస్తున్నా.. మారని తీరు
అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్న తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డిపై ఇటీవల ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు యెగ్గన శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం గ్రామాల్లో తనిఖీలు చేశారు. రవీందర్ రెడ్డి ఎలాంటి అర్హత లేకుండా అల్లోపతి వైద్యం నిర్వహిస్తున్నాడని తేలడంతో ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జాతీయ వైద్య కమిషన్ చట్టం 2019, రాష్ట్ర వైద్య చట్టాల ప్రకారం ఈనెల 4న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
కరీంనగర్‌కు చెందిన ఓ మెడికల్ ప్రాక్టీషనర్ ఎలాంటి అర్హతలు లేకున్నా నాలుగు బెడ్లు వేసి, ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఇంజక్షన్లు వేయడంతో పాటు సైలెన్లు పెడుతూ.. మందులు రాస్తున్నాడు. రక్త, మూత్ర పరీక్షలు సైతం రాస్తూ.. తెలిసిన కమీషన్ వచ్చే ల్యాబ్‌కు పంపిస్తున్నాడు. పరిస్థితి విషమిస్తే పర్సంటేజ్ ఇచ్చే కార్పొరేట్ ఆస్పత్రికి పంపిస్తూ పేదల జేబులు గుల్ల చేస్తున్నాడు.
కరీంనగర్: అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న వారిపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ), తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎస్‌ఎంసీ) వరుస దాడులు చేస్తున్నా జిల్లాలోని ఆర్‌ఎంపీ, పీఎంపీల తీరులో మార్పు రావడం లేదు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని మెడికల్ కౌన్సిల్ అధికారులు హెచ్చరిస్తున్నా ఇంజక్షన్లు వేస్తూ.. సైలెన్లు పెడుతున్నారు. ఓవర్ డోస్ మందులు ఇస్తూ రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. కొద్ది నెలలుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేసిన తనిఖీలు, బయటపడిన ఘటనల నేపథ్యంలో ఓ ఆర్‌ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
మోతాదుకు మించి మందులు
జిల్లాలో ఊరూరా ఆర్‌ఎంపీ, పీఎంపీలు కొనసాగుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు, ఎలాంటి సమస్య అయినా అర్హతలేని వైద్యం చేస్తూ ప్రాణాల మీదకు తెస్తున్నారు. నగరంలోని ఓ మహిళకు ఇటీవల జ్వరం రాగా ఓ ఆర్‌ఎంపీ ఇంజక్షన్ ఇచ్చాడు. అది ఇన్‌ఫెక్షన్ కావడంతో పెద్దాస్పత్రిలో ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులతో వైద్యాధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పలువురు ఏకంగా యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్‌ను ఇస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అవసరం లేకున్నా ప్రిస్కిప్షన్ ఇస్తున్న వారిని గుర్తిస్తున్నారు. వైద్యం పేరుతో పెద్దాస్పత్రులకు సిఫార్సులు చేస్తున్నారని, అక్కడ అన్నిరకాల పరీక్షలు, ఆపరేషన్లు చేయించడంతో పాటు కమీషన్లు తీసుకుంటున్న విషయాన్నీ గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేయడమే కాకుండా ఆస్పత్రులు, మందుల దుకాణాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.


