కదలం.. వదలం!
కరీంనగర్ బల్దియాలో ఇష్టారాజ్యం బదిలీలపై పారిశుధ్య జవాన్ల తీరు అధికారుల ఆదేశాలూ బేఖాతరు పాత డివిజన్లలో అదే దందా
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థలో దశాబ్దాల తరువాత చేపట్టిన జవాన్ల అంతర్గత బదిలీలు అపహాస్యమవుతున్నాయి. అధికారులు బదిలీ చేస్తే మేం డివిజన్లు వీడాలా..? అన్నట్లుగా కొంతమంది ఇష్టానురీతిలో వ్యవహరిస్తున్నారు. పేరుకు కొత్త డివిజన్‌కు బదిలీ అయినా, పాత డివిజన్లలో అదే దందాను యథేచ్చగా కొనసాగిస్తూ, అధికారులకే సవాల్ విసురుతున్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, అధికారులు, అధికార, విపక్ష పార్టీల నాయకులు.. ఎవరు దొరికితే వారితో ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతూ, బల్దియాను మార్చలేమనే స్థితికి తీసుకొస్తున్నారు.
బదిలీ చేస్తే వీడాలా?
నగరపాలకసంస్థలోని 66 డివిజన్ల పరిధిలో 61మంది రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య జవాన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతమందికి రెండు డివిజన్ల బాధ్యతలిచ్చారు. ఆయా డివిజన్లలో పారిశుధ్య నిర్వహణను జవాన్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కార్మికులతో పారిశుధ్య పనులు చేయించడంతో పాటు, డివిజన్‌లో పరిశుభ్రతను నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. విధుల్లో భాగంగా కొంతమంది స్వచ్ఛ ఆటోల నిర్వాహకులు, పారిశుధ్య కార్మికులు, దుకాణదారులు, చిన్న వ్యాపారులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెల మామూళ్లు ఇవ్వని వారిని నిబంధనల పేరిట ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పారిశుధ్య వ్యవస్థను ప్రక్షాళన చేసే క్రమంలో ఇటీవల నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సాహసోపేత నిర్ణయం తీసుకొన్నారు. నగరవ్యాప్తంగా ఉన్న మొత్తం 61 మంది జవాన్లకు స్థానచలనం కల్పించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆయా డివిజన్లలో ఏళ్లుగా పాతుకుపోయి పలు దందాలకు, నాయకుల ఇళ్లలో సేవలకు అలవాటు పడ్డ కొంతమంది బదిలీలను అంగీకరించడం లేదు. తమకున్న పరిచయాల ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. అధికార, విపక్ష అనే తేడా లేకుండా అన్ని పార్టీలు, ఉద్యోగ సంఘాల నాయకులతోనూ బదిలీల రద్దుకు విశ్వప్రయత్నం చేశారు. బదిలీల రద్దు కుదిరే అంశం కాదని అధికారులు తేల్చిచెప్పడంతో, పాత దందానే కొత్తగా మొదలు పెట్టారు. తమ వెనకాల ఉన్న నేతల అండదండలతో బదిలీలు చేస్తే మాత్రం వినాలా అన్నట్లుగా అధికారుల ఆదేశాలనే ధిక్కరిస్తున్నారు. తమ పాత డివిజన్లలో ఇప్పటికీ అనధికారికంగా విధులు నిర్వర్తిస్తూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
పంపకాల పంచాయితీ
పారిశుధ్య జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల నడుమ పంపకాల పంచాయితీ తీవ్రస్థాయికి చేరింది. జవాన్ల బదిలీలు ఖాయమైన నేపథ్యంలో, ఆ బదిలీలను కొంతమంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. ఆ ఆరోపణలు అర్థం లేనివని, పూర్తిస్థాయిలో బదిలీలను పారదర్శకంగా నిర్వహించినట్లు సంబంధిత బల్దియా అధికారులు కొట్టిపారేశారు. ఈ ఆరోపణలు, ఖండనలు ఎలా ఉన్నా...ఆయా డివిజన్లలో పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించే జవాన్‌లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల నడుమ పంపకాల పంచాయితీలు నివురుకప్పిన నిప్పులా ఉన్నాయనేది బహిరంగ రహస్యమే.
ప్రక్షాళన సాగాల్సిందే
రూ.కోట్ల ప్రజాధనం వెచ్చిస్తున్నా, నగరంలో అనుకున్న మేరకు పారిశుధ్యం మెరుగు పడడం లేదనేది వాస్తవం. పారిశుధ్యం విభాగాన్ని కాస్త గాడినపెట్టేందుకు చేపట్టిన జవాన్ల బదిలీలను కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్త వాళ్లతో పనులు మందగిస్తాయనే సాకుతో ఆయా డివిజన్లలోనే ఉండేట్లు ఒత్తిడి పెంచుతున్నారు. ఏదేమైనా చాలా ఏళ్ల తరువాత చేపట్టిన ప్రక్షాళన పర్వం పారిశుధ్య విభాగంలో కొనసాగించాల్సిందేనని నగరవాసులు కోరుతున్నారు. బల్దియా ఉన్నతాధికారులు ఆ దిశగా ముందుకు సాగాలంటున్నారు.
‘కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇటీవల చేపట్టిన అంతర్గత బదిలీల్లో ఓ జవాన్ పక్క డివిజన్‌కు వెళ్లాడు. ఏళ్లుగా పాత డివిజన్‌తో మమేకమైన సదరు జవాన్, ఆ డివిజన్‌ను వీడేందుకు ససేమిరా అన్నాడు. మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చాడు. బదిలీల్లో మార్పునకు ఉన్నతాధికారులు అంగీకరించ లేదు. కొత్త డివిజన్‌లో బాధ్యతలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. పాత డివిజన్‌పై ఉన్న మమకారం సదరు జవాన్‌ను అక్కడి నుంచి కదలనీయలేదు. పేరుకు కొత్త డివిజన్‌లో ఉన్నా, పాత డివిజన్‌లోనే పెత్తనం సాగిస్తున్నాడు. పాత దందాను కొనసాగిస్తున్నాడు.’
కదలం.. వదలం!


