79 పాఠశాలలకు ఫైవ్‌స్టార్
కరీంనగర్‌టౌన్: నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా క్షేత్రస్థాయిలో పాఠశాలల స్థితిగతులను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ, ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్’ (ఎస్‌హెచ్‌వీఆర్) కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా పాఠశాలలో మూత్రశాలలు, పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల వినియోగం, నీటి వసతి తదితర అంశాలు పక్కాగా అమలు చేస్తున్న పాఠశాలలకు మంచి రేటింగ్ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు, కస్తూరిబా, గురుకులాలకు చెందిన హెచ్‌ఎంలు సెప్టెంబరులో వారి పాఠశాలల పరిస్థితిని ఎస్‌హెచ్‌వీఆర్ యాప్ లేదా ‘ఎస్‌హెచ్‌వీఆర్. ఎడ్యుకేషన్.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో యూడైస్ కోడ్‌తో లాగినై నమోదు చేశారు. దీని ఆధారంగా జిల్లాలోని 79 పాఠశాలలకు 5 స్టార్ రేటింగ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. 679 ప్రభుత్వ పాఠశాలలు, 339 ప్రైవేటు పాఠశాలలు, మొత్తంగా 1,018 పాఠశాలు వివిధ రేటింగ్స్ సాధించాయి. గంగాధర మండలం ఒద్యారం హైస్కూల్ 125 మార్కులకు గానూ 124 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానం సాధించింది.
ఆరు అంశాల ఆధారంగా
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆరు ప్రధానాంశాలను నమోదు చేసి, దాన్ని బట్టి రేటింగ్ ఇచ్చారు. మొత్తం 60 ప్రశ్నలకు 125 మార్కులు సాధిస్తే 5స్టార్స్ లభిస్తుంది. నీటిసంరక్షణ, తాగునీటి వసతికి 22 మార్కులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, చేతుల శుభ్రతకు 27, మొక్కలు, తోటల పెంపకానికి 14, వ్యర్థాల నిర్వహణకు 21 మార్కులు, విద్యుత్ పొదుపు, సోలార్ వినియోగానికి 20, పర్యావరణ పరిరక్షణ అవగాహనకు 21 మార్కుల ఆధారంగా ఈ రేటింగ్స్ ఇచ్చినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఎకో క్లబ్ ఏర్పాటు లాంటి ఆరు విభాగాల్లోని 60 ప్రశ్నలకు ఆన్‌లైన్ ద్వారా సమాధానాలు సమర్పించారు. అవసరమైన ఫొటోలు అప్‌లోడ్ చేశారు.
జాతీయస్థాయిలో 200 పాఠశాలలు
జిల్లాలో 5 స్టార్ రేటింగ్ పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలను ప్రత్యేక బృందం భౌతిక పరిశీలన చేసి ప్రతిజిల్లా నుంచి 8 పాఠశాలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ప్రతీ రాష్ట్రం నుంచి 20పాఠశాలలను జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో 200 పాఠశాలలను ఎంపిక చేసి ఢిల్లీలో అవార్డులు, రూలక్ష స్కూల్ గ్రాంటు అందజేస్తారు.
జిల్లాలోని పాఠశాలలకు వచ్చిన రేటింగ్
రేటింగ్ పాఠశాలలు అంశం
5స్టార్ 79 అద్భుతం
4స్టార్ 465 చాలా బాగుంది
3స్టార్ 423 బాగుంది
2స్టార్ 36 సౌకర్యాలు మెరుగు పడాలి
1స్టార్ 15 స్వచ్ఛతలో అతి తక్కువ
సంతోషంగా ఉంది


