
నేడు ప్రజావాణి రద్దు
కరీంనగర్ అర్బన్: ఎన్నికల కోడ్ క్రమంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని వెల్లడించారు. కోడ్ ముగిసిన అనంతరం కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.
దొంగ ఓట్లతోనే అధికారంలోకి బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్: దేశవ్యాప్తంగా నమోదు చేసుకున్న దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వస్తోందని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆరోపించారు. ఓటుచోరీపై ఆదివారం నగరంలోని ఇందిరాచౌక్ వద్ద 64వ డివిజన్ నుంచి సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుచోరీని అరికట్టడానికి ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్నారు. ఇందులో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ నెల 17వ తేదీ లోగా నగరంలోని అన్ని డివిజన్లలో సంతకాల సేకరణ చేయాలన్నారు. 64వ డివిజన్ కాంగ్రెస్ బాధ్యుడు పెద్దిగారి తిరుపతి ఆధ్వర్యంలో డివిజన్ వాసులు పి.పద్మ,కోమలత, మనీషా,ఆరిఫ్,వెన్నెల,సోహెల్, శివాని తదితరులు పత్రాలపై సంతకాలు చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రహ్మత్ హుస్సేన్, కొరివి అరుణ్ కుమార్, వెన్న రాజమల్లయ్య, శ్రీనివాస్, అబ్దుల్ రహమాన్, అహ్మద్ అలీ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఎండీ.చాంద్, దండి రవీందర్, కుర్ర పోచయ్య పాల్గొన్నారు.