
అవయవదానాలపై అసెంబ్లీలో చర్చిస్తా
కోల్‌సిటీ(రామగుండం): అవయవదానాలపై రాబోయే అసెంబ్లీలో నేనే స్వయంగా చర్చిస్తానని, పలు రాష్ట్రాలకు ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గోదావరిఖనిలోని సిమ్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గురువారం నిర్వహించిన సదాశయ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవయవ దాతల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేసి అభినందించారు. సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రవణ్ కుమార్, సిమ్స్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, హెచ్‌వోడీలు డాక్టర్ అరుణ, డాక్టర్ శశికాంత్ కిరాగి, డాక్టర్ రణధీర్‌తో పాటు ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి పి.శ్యాంసుందర్, ఎల్వీపీ బ్యాంక్ మేనేజర్ కిషన్ రెడ్డి, వాసన్ ఐ బ్యాంక్ మేనేజర్ అరవింద్ కుమార్, రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.