
మహిళా సాధికారికత.. ఆరోగ్య సంరక్షణ
మల్యాల: మహిళలు స్వయం ఉపాధి పొందుతూ..ఆర్థికంగా నిలదొక్కుకుంటే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. తద్వారా మహిళా సాధికారికతకు బాటలు పడుతాయనే సంకల్పంతో నిరుపేద మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అందజేసి మహిళా సాధికారిత దిశగా అడుగులు వేసేందుకు బీఎన్ రావు ఫౌండేషన్ తోడ్పాటునందిస్తోంది. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమనే సంకల్పంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాలకు వందలాది పుస్తకాలు అందజేశారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. మల్యాల మండలం నూకపల్లి గ్రామానికి చెందిన సామాజిక వేత్త, వైద్యుడు బీఎన్ రావు వ్యవస్థాపక చైర్మన్‌గా 2017లో బీఎన్ రావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ, ఆరోగ్య సంరక్షణపై ప్రజలను చైతన్యపరుస్తు, ఇటు వైద్యపరంగా అవగాహన పెంపొందిస్తూ, అటు మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, వారికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ, ఆరోగ్య సమాజం కోసం తనవంతు సేవలందిస్తున్నారు. బీఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని నిరుపేద మహిళలను గుర్తిస్తూ, స్వయం ఉపాధి కల్పించి, మహిళా సాధికారికత కోసం ఉచితంగా కుట్టుమిషన్ల శిక్షణ అందిస్తున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్, మల్యాలలో కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. వేములువాడ, గంగాధరలో సైతం ఉచిత కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మల్యాలలో న్యాక్ సౌజన్యంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.