
పెద్దపులి సంచారం వదంతులు నమ్మొద్దు
పాలకుర్తి: బసంత్‌నగర్ సమీపంలోని బుగ్గ అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని ఈసాలతక్కళ్లపల్లి సెక్షన్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దేవదాస్ తెలిపారు. ఏఐ టెక్నాలజీతో కొంతమంది ఆకతాయిలు బుగ్గ రోడ్డుపై పెద్దపులి సంచరిస్తున్నట్లు రెండురోజులుగా సోషల్ మీడియాలో ఫొటో వైరల్ కావడంతో పాటు కొన్ని పత్రికల్లో సైతం వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన ఫారెస్టు అధికారులు బుగ్గ అటవీప్రాంతంలో క్షేత్రస్థాయిలో గురువారం పర్యటించారు. రామగుండం డీఆర్‌వో కొమురయ్య, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పెద్దపల్లి సతీశ్‌కుమార్, బీట్ ఆఫీసర్ మేఘరాజ్, ఫారెస్టు సెక్షన్ అధికారి రహమతుల్లాతో కలిసి పరిశీలించారు. పులి సంచరించినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో పులి సంచారం పుకారుగా నిర్థారించిన అధికారులు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. అదేవిధంగా సోషల్‌మీడియాలో వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బసంత్‌నగర్, అంతర్గాం ఎస్సైలను కోరినట్లు దేవదాసు తెలిపారు.