
దూసుకొచ్చిన మృత్యువు
బైక్‌ను వేగంగా ఢీకొట్టిన కారు
ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిన యువకుడు
అక్కడికక్కడే మృతి.. నిజాయితీగూడెంలో విషాదం
మానకొండూర్: కారురూపంలో మృత్యువు వేగంగా దూసుకొచ్చింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న యువకుడు ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల వద్ద జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద గురువారం చోటు చేసుకుంది. మానకొండూర్ మండలం నిజాయితీగూడెం గ్రామానికి చెందిన చామంతులు శ్రీనివాస్(27) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పని నిమిత్తం బైక్‌పై కరీంనగర్ వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా చెంజర్ల వద్ద జాతీయ రహదారి ప్లైఓవర్ బ్రిడ్జిపై కరీంనగర్ వైపు వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. శ్రీనివాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ బి.సంజీవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.