
గంగ స్నానానికి వచ్చేదెట్లా..
● బస్సుల రద్దుతో ప్రయాణం ప్రయాస ● రద్దయిన సిరిసిల్ల, బెల్లంపల్లి బస్సు సర్వీసులు ● నిలిచిపోయిన సిరిసిల్ల, గర్శకుర్తి, కరీంనగర్ రూట్ సర్వీస్ ● బస్సులను పునరుద్ధరించాలని విన్నపం
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల ప్రజలకు ఆర్టీసీ బస్సు సేవలు అంతంతే. అందులోనూ ఇటీవల మూడు బస్సు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణ కష్టాలు మరింత పెరిగాయి. సిరిసిల్ల డిపో నుంచి వయా బోయినపల్లి, గంగా ధర, జగిత్యాల, ధర్మపురి మీదుగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వరకు రోజు ఉదయం రెండు బస్సులు నడిచేవి. ఇవే రెండు బస్సులు తిరిగి సాయంత్రం మళ్లీ ఇదే రూట్‌లో సిరిసిల్లకు చేరుకునేవి. ఇందులో ఒక బస్సు ఉదయం 7 గంటలకు, మరో బస్సు ఉదయం 9 గంటలకు బోయినపల్లికి చేరుకునేవి. కరీంనగర్–1 డిపో నుంచి వయా కురిక్యాల, గర్శకుర్తి, విలాసాగర్, బోయినపల్లి మీదుగా వేములవాడ సిరిసిల్ల వెళ్లేది. గర్శకుర్తి, సిరిసిల్ల బస్సు ఉదయం వచ్చేది. ఈ బస్సు సైతం కొద్ది రోజులుగా నిలిచిపోయింది.
బెల్లంపల్లి బస్సు రాక గంగస్నానానికి ఇక్కట్లు
సిరిసిల్ల, బెల్లంపల్లి, కరీంనగర్– సిరిసిల్ల మూడు ఆర్టీసీ బస్సుల రాకపోకలు బంద్ కావడంతో ఈ బస్సుల ఆధారంగా ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల–బెల్లంపల్లి బస్సుతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే వారు. ఎక్కువ మంది భక్తులు గంగ(గోదావరి నది) స్నానానికి ఈ బస్సులోనే వెళ్లేవారు. బోయినపల్లిలో బస్సు ఎక్కితే ధర్మపురిలోనే దిగేవారు. ఈ బస్సు ఇప్పుడు నిలిచిపోవడంతో ధర్మపురికి వెళ్లే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్–సిరిసిల్ల బస్సు గర్శకుర్తి మీదుగా వెళ్లడంతో పలువురు నేతకార్మికులు, ఇతర వ్యాపారులు ఈ బస్సులో వెళ్లి ముడిసరుకులు తెచ్చుకునేవారు. ఈ బస్సు రద్దు కావడంతో ఈ రూట్‌లోని ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బోయినపల్లి మండలానికి గంగాధర–వేములవాడ రింగ్ బస్సు నడిచేది. అది కూడా రావడం లేదు. ఆర్టీసీ అధికారులు స్పందించి సిరిసిల్ల–బెల్లంపల్లి, కరీంనగర్–సిరిసిల్ల బస్సులు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.