
గుండెపోటుతో యువకుడి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్‌కు చెందిన కూడలి పర్శరాములు(35) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. పర్శరాములు గ్రామంలో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గ్రామంలోనే కూలీ పనిచేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కడు పేదరికం అనుభవిస్తున్న పర్శరాములు మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం పర్శరాములు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుడికి భార్య వినోద, కుమారుడు రిత్విక్ ఉన్నారు.
మల్లాపూర్: మండలంలోని వాల్గొండ తండాకు చెందిన లకావత్ రమేశ్ (45) దుబాయిలోని షార్జాలో బుధవారం వేకువజామున మూడు గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. రమేశ్ ఉపాధి కోసం ఏడాది క్రితం దుబాయి వెళ్లాడు. షార్జాలోని ఓ కంపనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు నిర్వర్తించి తన గదిలో నిద్రిస్తుండగా గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి కార్మికులు ఇక్కడి కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. రమేశ్‌కు భార్య పద్మ, కుమార్తె వసంత, కుమారుడు హర్షిత్ ఉన్నారు. శవాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కోరారు.
హుజూరాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందినట్లు తెలిపారు. మున్సిపల్ పారిశుధ్య సూపర్‌వైజర్ తూముల కుమారస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.
ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం లభ్యం
హుజూరాబాద్ మండలం ఇప్పలనర్సింగాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌లో ఓ గుర్తు తెలియని మృతదేహం బుధవారం కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడి వయస్సు 40ఏళ్లు ఉంటుందని గుర్తించారు. మృతుడు రెండు రోజుల క్రితం కాలువలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యనా.? లేక మరేదైనా కారణాలా అని తెలియాల్సి ఉంది.
● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి
గంగాధర: వృద్ధదంపతులిద్దరూ ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. భర్త చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్సై వంశీకృష్ణ వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో గజ్జెల శంకరయ్య(75)– లక్ష్మి(70) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఎవరూ లేరు. మంగళవారం ఇద్దరూ ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గ్రామస్తులు గమనించారు. వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శంకరయ్య బుధవారం చనిపోయాడు. లక్ష్మి చికిత్స పొందుతోంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

గుండెపోటుతో యువకుడి మృతి