విచ్చలవిడిగా ఎరువుల వినియోగం | - | Sakshi
Sakshi News home page

విచ్చలవిడిగా ఎరువుల వినియోగం

Sep 25 2025 12:17 PM | Updated on Sep 25 2025 12:17 PM

విచ్చలవిడిగా ఎరువుల వినియోగం

విచ్చలవిడిగా ఎరువుల వినియోగం

వీణవంక: ఉత్తర తెలంగాణలోనే వరి సాగులో కరీంనగర్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడి నేలలు సాగుకు అనుకూలంగా ఉండటంతో దిగుబడి కూడా గణనీయంగా ఉంటుంది. పండించిన ధాన్యానికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉండటం రైతులకు కలిసొస్తుంది. మూడేళ్లుగా మొగిపురుగు విజృంభిస్తుంది. దీనికి తోడు వివిధ రకాల తెగుళ్లు పైరును ఆశిస్తుండటంతో రైతులు పంటను కాపాడుకునేందుకు నారుమడి నుంచే విచ్చలవిడిగా రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. ప్రస్తుతం పొలాలు పొట్టదశలో ఉండగా, కొన్ని చోట్ల పిలక దశలో ఉంది. ఇప్పటివరకు ఒక్కో రైతు సగటున నాలుగు నుంచి ఐదుసార్లు మందులను పిచికారీ చేశారు. ఇంకా పంట చేతికి వచ్చేసరికి మరో రెండుసార్లు పిచికారీ చేయాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.71లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రైతులు అధిక రసాయన ఎరువులు వాడుతున్నారు. దీంతో భూసారం తగ్గి పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుంది. రసాయన ఎరువుల వాడకం బదులు సేంద్రియ ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులతో పాటు భూసారం పెరుగుతుంది. అయితే రైతులు వీలైనంత వరకు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగిస్తే పంటకు అన్ని రకాల పోషకాలు అందుతాయని కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు చెప్పుతున్నారు.

విచ్చలవిడిగా రసాయనాలు

ఈ సీజన్‌ ప్రారంభంలో నారుమడికి మొగిపురుగు తగిలింది. దీంతో రెండునుంచి మూడుసార్లు పిచికారీ చేశారు. నాటువేసిన 15రోజులకు గుళికలతో పాటు యూరియాలో రసాయన మందులను కలిపి పొలంలో చల్లారు. మళ్లీ నెలతర్వాత మొగిపురుగుతో పాటు తెగుళ్లు వ్యాప్తిచెందాయి. దీంతో మళ్లీ పిచికారీ చేశారు. ప్రస్తుతం సుడిదోమ వ్యాప్తి చెందుతుంది. ఒక్కో రైతు పంటకాలం పూర్తయ్యే సరికి ఎకరాకు రూ.15వేల విలువగల ఖరీదైన రసాయన మందులను చల్లుతున్నారు. దీనికి బదులు సేంద్రియ ఎరువులు(జీవామృతం) వాడితే బాగుండేదని అధికారులు తెలుపుతున్నారు.

పశువుల ఎరువు మేలు

సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్‌మడ్డి, వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, జీవన ఎరువులు ఇలాంటి వాటిని ఎక్కువగా రైతులు వినియెగించాలి. గ్రామాల్లో పశువుల ఎరువు దొరుకుతుంది. ఏటా ఈ ఎరువును పొలంలో చల్లాలి. పంట ఏపుగా వస్తుంది. కొందరు రసాయన ఎరువులను ఇష్టానుసారంగా వాడుతున్నారు. దీంతో భూసారం కోల్పోయి పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.

భూసార పరీక్ష చేసుకోవాలి

ఏటా భాసార పరీక్షలు చేసుకోవాలి. దీంతో భూమిలో ఎంతమేరకు ఎరువులు, ఏఏ ఎరువులు వాడాలో తెలుస్తుంది. నాట్లు వేసిన తర్వాత రైతులు సరైన సమయంలో ఎరువులు వేసుకోవాలి. వ్యవసాయాధికారుల సూచనల ప్రకారం ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో పంట చివరి దశవరకు రెండు, మూడు దఫాలుగా చల్లుకోవాలి. యూరియా రూపంలో నత్రజనిని వాడినప్పుడు బస్తా యూరియాకు 10కిలోల వేప పిండి వేసుకుంటే మంచిది.

అతిగా వాడకం ప్రమాదకరమని హెచ్చరిస్తున్న నిపుణులు

సేంద్రియ ఎరువులతోనే నేలకు జీవం

దిగుబడితోపాటు భూసారం పెంపు

జిల్లాలో 2.71 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా

సేంద్రియ ఎరువుల వాడకం మేలు

రసాయన ఎరువులు విచ్చలవిడిగా పిచికారీ చేయడం మంచిది కాదు. సేంద్రియ ఎరువులు నేలకు మంచిది. సిఫార్సు మేరకే ఎరువులు వాడాలి. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. ఒకేరకమైన పంట ఏళ్ల తరబడి వేసే బదులు పంట మార్పిడి చేస్తే పురుగు తగ్గడంతో పాటు దిగుబడి పెరుగుతుంది. – రాకేశ్‌

వ్యవసాయ విస్తరణాధికారి, వీణవంక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement