
పాక్షికంగా నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
కరీంనగర్‌టౌన్: ఆరోగ్య శ్రీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలు బుధవారం పాక్షికంగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు మూకుమ్మడిగా సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. గతేడాదికాలంగా ఆరోగ్యశ్రీ బిల్లులు రాకపోవడంతో విధిలేని పరిస్థితిలో సేవలు నిలిపివేస్తున్నట్లు ఆయా ఆసుపత్రుల నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 49 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉండగా, అందులో 32 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే సేవలు నిలిపివేశారు. కరీంనగర్ శివారులోని రెండు మెడికల్ కళాశాలలతో పాటు అపోలోరీచ్, మెడికవర్, మరో రెండు,మూడు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తున్నారు.