
60 మందిపై పిచ్చికుక్క దాడి
● పది మంది పిల్లలు.. నలభై మందికి పైగా పెద్దలు ● సిరిసిల్ల ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు
సిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం పిచ్చికుక్క వీరంగం చేసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రజలను కరుస్తూ భయాందోళన సృష్టించింది. ఒకే కుక్క సుమారు 60 మందికి పైగా కరిచింది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్లలో గురువారం సాయంత్రం ఓ పిచ్చికుక్క ఇందిరానగర్, తారకరామానగర్, బీవైనగర్, గణేశ్‌నగర్, మార్కెట్‌పల్లి, సాయినగర్, మార్కెట్ కమిటీ తదితర ప్రాంతాల్లో హల్‌చల్ చేసింది. ఇంటిబయట తిరుగుతూ కనిపించిన వారిని కరిచింది. మనుషులు కనిపిస్తే చాలు ఉక్రోషంతో ఊగిపోతూ దాడి చేసింది. సుమారు 60 మందికి పైగా దాడి చేయగా.. ఏడాదిన్నర వయస్సున్న పాప, మరో ఇద్దరు మూడేళ్లలోపు చిన్నారులు, పదమూడేళ్లలోపు ఏడుగురు ఉన్నారు. బాధితులు వరుసగా జిల్లా ఆస్పత్రికి క్యూ కట్టారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 50 మందికి పైగా చికిత్స అందించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బాధితులకు టీటీ, ఏఆర్వీ, ఇమ్యూనోగ్లోబిలెన్స్ ఇంజక్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఒక్కొక్కరికి మూడేసి ఇంజక్షన్లు వేయడమే కాకుండా యాంటిబయాటిక్స్, నొప్పి తదితర మందులను అందించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులు ఎంతమంది ఉన్నా..చికిత్స అందించేందుకు ఆస్పత్రి సిబ్బందిని 24గంటల పాటు అందుబాటులో ఉంచారు.
పరిస్థితిని తెలుసుకున్న ప్రభుత్వ విప్
సిరిసిల్లలో పిచ్చికుక్క దాడిలో పెద్దసంఖ్యలో బాధితులు ఉండడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆస్పత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని సూచించారు.
కుక్కను పట్టుకునే పనిలో బల్దియా
కనిపించిన వారిపైన దాడి చేసిన కుక్కను పట్టుకోవడానికి సిరిసిల్ల మున్సిపల్ సిబ్బంది చర్యలకు దిగారు. కమిషనర్ ఎం.ఏ.ఖదీర్‌పాషా ఆదేశాలతో క్షతగాత్రులు ఉన్న ఏరియాల్లో సిబ్బందిని పంపి కుక్క కోసం గాలింపు చేపట్టారు.

60 మందిపై పిచ్చికుక్క దాడి

60 మందిపై పిచ్చికుక్క దాడి

60 మందిపై పిచ్చికుక్క దాడి