
ఎందుకు చంపారు
ముగ్గురు అధికారుల బృందం
గట్టు వామన్‌రావు, నాగమణి హత్యలో దర్యాప్తు ముమ్మరం
వామన్‌రావు తండ్రిని కలిసి, స్పాట్‌ను పరిశీలించిన బృందం
రామగుండం కమిషనరేట్‌లో కార్యాలయం కేటాయింపు
ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా సీబీఐ రంగప్రవేశం
ఎలా చంపారు?
సాక్షి,పెద్దపల్లి/మంథని: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టువామన్‌రావు, నాగమణిల హత్యకేసులో విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఓ బీఆర్‌ఎస్ నేతకు సంబంధం ఉందంటూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 12న సుప్రీంకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం 2022లో నిషేధం విధించగా.. ఈ ఉత్తర్వులను ప్రస్తుతం ఉపసహంరించుకోవడంతో గురువారం సీబీఐ అధికారులు పెద్దపల్లి జిల్లాలో విచారణ చేపట్టారు. దీంతో ఈ హత్య కేసులో ఏమైనా కుట్రకోణం ఉందా? అరెస్ట్ అయిన నిందితులే కాకుండా ఇతరుల పాత్ర ఏమైనా ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టనుండగా.. వామన్‌రావు దంపతుల హత్యకేసు ఉమ్మడి జిల్లాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
55 నెలల తరువాత
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టువామన్‌రావు, నాగమణి దంపతులు 2021 ఫిబ్రవరి 17న రామగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కల్వచర్ల సమీపంలో హత్యకు గురయ్యారు. కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితులతో పాటు సహకరించిన ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపిచారు. కొద్దిరోజులకు బెయిల్‌పై బయటకు వచ్చారు. కేసులో అప్పటి పోలీసు యంత్రాంగం సరైన దిశలో విచారణ చేపట్టలేదని, కీలక నిందుతుడిని తప్పించారంటూ వామన్‌రావు తండ్రి కిషన్‌రా వు ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుతోనే తనకు న్యా యం జరుగుతుందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పుతో హత్య జరిగి నాలుగేళ్ల 7నెలలకు సీబీఐ విచారణ చేపట్టింది.
కేసు విచారణలో భాగంగా ముగ్గురు సీబీఐ అధికారుల బృందం గురువారం మంథనిలో పర్యటించారు. మొదట వామన్‌రావు తండ్రి కిషన్‌రావు, సోదరుడు చంద్రశేఖర్, కుటుంబ సభ్యులను వారి స్వగ్రామం గుంజపడుగులో కలిసి వివరాలు తెలుసుకున్నారు. మంథని కోర్టు ఆవరణలో పలు అంశాలను పరిశీలించారు. అక్కడి నుంచి హత్య జరిగిన ప్రదేశానికి వచ్చి పరిశీలించారు. సీబీఐ బృందానికి రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఓ కార్యాలయాన్ని కేటాయించారు. కేసు సమన్వయం చేసేందుకు గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్‌ను కేటాయించారు. కేసు పూర్వాపరాలతో పాటు ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్, రిమాండ్ కేసు డైరీ, చార్జీషీట్లను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే పుట్టమధు చేసిన వాఖ్యలకు నిరసనగా అతని ఇంటి ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయగా, అన్ని మండలాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా ధర్నాలు, బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా జంట హత్యకేసుల్లో సీబీఐ ఎంట్రీతో జిల్లాలో రాజకీయం మరింత హీటెక్కింది.
సీబీ‘ఐ’ ఎంట్రీ!