
హుండీలే టార్గెట్
● ఆలయాల్లో వరుస చోరీలు
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలంలో దొంగలు హుండీలను టార్గెట్ చేసి వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. మండలంలోని నాలుగు ఆలయాల్లో హుండీలు పగులగొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. దీంతో పోలీసులకు ఆలయ కమిటీ చైర్మన్లు, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసుల నుంచి సరైన స్పందన లభించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్మారం మండలం గోపాల్‌రావుపేటలోని శ్రీ వేంకటేశ్వరాలయం, నందిమేడారం అమరేశ్వరాలయం, ఇదే గ్రామంలోని హనుమాన్ ఆలయంలో దొంగలు హుండీలను పగులకొట్టి నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఒకవైపు నిఘా పెట్టినా తాజాగా సోమవారం రాత్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దొంగలు హుండీ పగులగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అక్కడే పడేసి వెళ్లిపోయారు. దీంతో ఆలయ చైర్మన్ ఈవోకు సమాచారం ఇవ్వడంతో అదే రోజు హుండీ డబ్బులు లెక్కించారు. వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా నందిమేడారం అమరేశ్వరాలయం చైర్మన్ కోరిక మేరకు ఎన్‌ఆర్‌ఐ దామోదర్‌యాదవ్ ట్రస్టు ఆధ్వర్యంలో సోలార్ సీసీ కెమెరాలను ట్రస్టు కోఆర్డినేటర్ వేల్పుల నాగరాజు అందించారు.
దొంగల బెడదతోనే హుండీ లెక్కింపు
ధర్మారం మండలం శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం రాత్రి దొంగలు ముసుగుతో వచ్చి హుండీ పగులగొట్టేందుకు ప్రయత్నించారు. హుండీకి నాలుగు రకాల తాళాలు వేయడంతో పగులగొట్టడం సాధ్యం కాలేదు. దీంతో వదిలిపెట్టి వెళ్లిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. హుండీని పగులగొట్టడంతోనే నగదు లెక్కించినట్లు ఆలయ చైర్మన్ సంతోష్ తెలిపారు.
దొంగలను పట్టుకుంటాం
ఆలయాల్లో వరుస చోరీలు జరగడంతో నిఘా పెట్టాం. ఫింగర్ ప్రింట్ తీసుకున్నాం. పాత నేరస్తుల ఫింగర్ ప్రింట్‌లను టాలీ చేస్తున్నాం. సీడీఆర్ కాల్‌డాటాపై విచారణ చేస్తున్నాం. రాత్రి వేళ వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆలయ కమిటీలకు సూచించాం.
– ఎస్సై ప్రవీణ్‌కుమార్