
విద్యార్థులు కళల్లోనూ రాణించాలి
కరీంనగర్/కరీంనగర్‌టౌన్: విద్యార్థులు చదువుతోపాటు వివిధ కళలు, క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లాస్థాయి ‘కళోత్సవ్’ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా వివిధ కళలు, ఆటల్లోనూ రాణించాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఇలాంటి పోటీలకు ప్రోత్సహించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విభిన్న రంగాల్లో రాణించేందుకు జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తోందన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబించేందుకు ఇలాంటి కార్యక్రమాలు వేదికగా ఉంటాయన్నారు. డీఈవో మొండయ్య, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, జ్యూరీ మెంబర్లు పాల్గొన్నారు.
మహిళ ఆరోగ్యంతోనే దేశాభివృద్ధి
మహిళ ఆరోగ్యంగా ఉంటేనే తన కుటుంబం తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ‘స్వస్థ్ నారి– స్వశక్త్ పరివార్ అభియాన్’ 8వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాలను దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనూ ఈ వర్చువల్ ప్రారంభోత్సవం జరిగింది. హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళ తన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం గర్బిణులకు వైద్య పరీక్షల గురించి తెలిపే ఎన్సీపీ కార్డులు అందజేశారు. క్రిటికల్ కేర్ విభాగాన్ని సందర్శించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీంఎహెచ్‌వో వెంకటరమణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థులు కళల్లోనూ రాణించాలి