
అస్తిత్వ పోరాటానికి ప్రతీక
సాయుధ పోరాటం నుంచి మిలియన్ మార్చ్ దాకా తెలంగాణ ఉద్యమం
ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం
ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా బుధవారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రి లక్ష్మణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. నాటి ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి మిలియన్ మార్చ్ వరకు ఉవ్వెత్తున చేసిన అనేక పోరాటాలు చరిత్రలో ప్రసిద్ధిగాంచాయన్నారు. 1956లో రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్ది కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడిందన్నారు. 2000 సంవత్సరం నుంచి మలి దశ తెలంగాణ పోరాటం కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఆచార్య జయశంకర్, జమలాపురం కేశవరావులు తెలంగాణ ప్రజలను చైతన్యం చేయగా, ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీకాంతాచారి, యాదయ్య లాంటి విద్యార్థులు, కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మబలిదానాలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, ఊరూరా నిరాహార దీక్షలతో చారిత్రాత్మక ఘట్టాలకు తెలంగాణ వేదికై ందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకు సంక్షేమ పథకాలతో ప్రజాపాలన అందిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకాన్ని 5 కోట్ల 35 లక్షల మంది మహిళలు వినియోగించుకుని, రూ.227 కోట్ల 34లక్షల లబ్ధి పొందారన్నారు. 6 లక్షల 33 వేల 737 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరుగుతోందన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో ఒక లక్షా 58 వేల 875 సర్వీసులకు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం ద్వారా లక్ష 90 వేల 186 మంది రైతులకు లబ్ధి చేకూరుతోందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు 15 వేల 436 మందికి రూ.44 కోట్ల 23 లక్షల విలువ చేసే శస్త్ర చికిత్సలు చేయించడం జరిగిందన్నారు. జిల్లాలో 11 వేల 575 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, 39 వేల 645 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు.