
పోషకాహారంతో ఆరోగ్యమస్తు!
ఆరోగ్య బాల్యం.. అవగాహనే కీలకం
ప్రాధాన్యం తెలిపేలా మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యక్రమాలు
ఈనెల 17నుంచి అక్టోబర్ 16 వరకు పోషణమాసం
కరీంనగర్: నేటి బాలలే రేపటి పౌరులు నినాదంతో చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నా పోషణ లోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. దీన్ని గుర్తించిన జిల్లా యంత్రాంగం పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈనెల 17నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు, పెద్దలు నిత్యం పోషక విలువలున్న పదార్థాలు తీసుకోవాలని తెలియజేస్తూ మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రతీ ఏడాది సెప్టెంబర్‌ను పోషణ మాసంగా నిర్వహిస్తోంది. బుధవారం నుంచి పోషణమాసం ప్రారంభమైంది. పిల్లలు, బాలింతలు, గర్భిణులు పోషకాహార లోపాలను అధిగమించడానికి మహిళా, శిశు సంక్షేమశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు, రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు విటమిన్లు, ఖనిజాలు, ప్రొటిన్లు, శక్తి పుష్కలంగా లభించే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పోషణ అభియాన్ కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి సరస్వతి తెలిపారు.
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 04
అంగన్‌వాడీ కేంద్రాలు 777
3–6 ఏళ్లలోపు పిల్లలు 21,107
గర్భిణులు, బాలింతలు 11,764