
జ్వరం చూసి.. భోజనం చేసి
● గంగాధరలో గురుకులాలను తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్‌అర్బన్/గంగాధర: గంగాధరలోని మహాత్మజ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, మధురానగర్ చౌరస్తాలోని బాలికల మైనారిటీ గురుకులాన్ని కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులు కూర్చోవడానికి సరఫరా చేసిన గ్రీన్‌మ్యాట్లు ఉపయోగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న విద్యార్థులతో మాట్లాడారు. మెడికల్ రిజిస్టర్ తనిఖీ చేసి, మందులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ వెంట బీసీ సంక్షేమ అధికారి అనిల్‌ప్రకాశ్ ఉన్నారు.
జిల్లాలో ఏడు ఇసుక రీచ్‌ల కేటాయింపు
వినియోగదారుల అవసరాల నిమిత్తం జిల్లాలో ఏడు ఇసుక రీచ్‌ల నుంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇసుక రవాణాకు అనుమతులను మంజూరు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ చాంబర్‌లో డిస్టిక్ లెవెల్ సాండ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వినియోగదారుల అవసరాల నిమిత్తం ఊటూరు–2, ఊటూరు–1, చల్లూర్, మల్లారెడ్డిపల్లి, కోర్కల్, కొండపాక, పోతిరెడ్డిపల్లి రీచ్‌లను కేటాయించినట్లు పేర్కొన్నారు. చేగుర్తి ఇసుక రీచ్‌ను ప్రభుత్వ అవసరాలు, ఇందిరమ్మ నిర్మాణానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల, పెగడపల్లి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ అవసరాలకు రామడుగు మండలం మోతెలోని ఇసుక రీచ్ నుండి 15,000 మెట్రిక్ టన్నుల ఇసుక తీసుకునేందుకు అనుమతించామని వెల్లడించారు. ఆర్టీవో మహేశ్వర్, మైనింగ్‌శాఖ ఏడీ రాఘవరెడ్డి, ఈఈలు బలరామయ్య, రవీంద్ర కిషన్, జిల్లా ఇరిగేషన్ అధికారి జగన్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జియాలాజిస్ట్ ప్రసన్న కరణం పాల్గొన్నారు.