
ఉచిత ప్రయాణం.. అతివకు గౌరవం
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం వారికి దక్కిన అసలైన గౌరవమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహా లక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి, రూ.6,680 కోట్ల చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం సంబరాలు నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఆర్టీసీ అద్దె బస్సులకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలను యజమానులుగా చేయడం గొప్ప విషయం అన్నారు. కరీంనగర్ రీజియన్‌లో మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 4 కోట్ల 83 లక్షల ప్రయాణాలు చేశారని, రూ.201.82కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు. సీపీ గౌస్‌ఆలం మాట్లాడుతూ.. ఆర్టీసీలో మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యంతో ఆర్థికంగా ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఆర్‌ఎం బి.రాజు మాట్లాడుతూ కరీంనగర్ రీజియన్‌లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు 244 బస్సులు ఉన్నాయని తెలిపారు. అనంతరం వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కలెక్టర్, సీపీ, ఆర్టీసీ అధికారులు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు బస్సులో ప్రయాణించారు.
ఆటపాటలతో విద్యను బోధించాలి
కరీంనగర్‌రూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కరీంనగర్ మండలం చామనపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులతో పాటలు, రైమ్స్ పాడించారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలవారీ సిలబస్‌ను అమలు చేయాలని అన్నారు. విద్యాశాఖ యాప్‌లో విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరును తప్పనిసరిగా నమో దు చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, ప్రోగ్రాం అధికారి సనా, పీహెచ్‌సీ వైద్యుడు మనోహర్ పాల్గొన్నారు.