వివాదాస్పదమైన డీఎంహెచ్‌వో ఆసుపత్రి తనిఖీ
గోదావరిఖని: నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ మిషన్ కలిగి ఉన్న స్థానిక లక్ష్మినగర్‌లోని శ్రీమమత ఆసుపత్రిపై శనివారం కేసు నమోదు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.అన్నాప్రసన్నకుమారి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించామన్నారు. అల్ట్రాసోమ్ స్కాన్ మెషిన్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్‌జే స్వాతి చాంబర్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. మిషన్‌కు పీసీపీఎన్‌డీటీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ లేదన్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది, పోలీస్ శాఖ ద్వారా సంయుక్తంగా పరిశీలించారని, రిజిస్ట్రేషన్ లేకుండా చట్టవిరుద్ధంగా 2023 నుంచి నడుపుతున్నట్టు గుర్తించామని అన్నారు. డీఎంహెచ్‌వో రిసెప్షనిస్టు కాలర్ పట్టుకొని తీసుకెళ్లడం, బూతులు తిట్టడం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో.. తనిఖీ అంశం వివాదాస్పదంగా మారింది.
డీఎంహెచ్‌వోపై కేసు
ఆసుపత్రి రిసెప్షన్‌గా పని చేస్తున్న చెప్పకుర్తి ఆనందం ఫిర్యాదు మేరకు డీఎంహెచ్‌వోపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆసుపత్రికొచ్చి స్కానింగ్ మిషన్ ఏ గదిలో ఉందో చూపించాలని దుర్భాషలాడారన్నారు. కాలర్ పట్టుకొని లాక్కెళ్లి గది తాళాలు పగలగొట్టి బూతులు తిడుతూ డాక్టర్‌ను పిలవమని చెప్పారని అన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


