లక్కీ కాంట్రాక్టర్!
● పనులు ప్రారంభించకముందే చెక్కు రెడీ ● బొమ్మకల్ ఫ్లైఓవర్ పెయింటింగ్‌కు రూ.40 లక్షలు
కరీంనగర్ కార్పొరేషన్: చేసిన పనులకు బిల్లుల కోసం ఏళ్లతరబడి నగరపాలకసంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న కాంట్రాక్టర్లు ఎంతోమంది. నానా తిప్పలు పడితే వాయిదాల లెక్కన బిల్లులు వచ్చేది ఎప్పుడో. కాని ఈ కాంట్రాక్టర్ మాత్రం చాలా అదృష్టవంతుడు?..పనులు మొదలు పెట్టకముందే బిల్లు రెడీగా ఉంది. ఆయన పనులు చేయడమే ఆలస్యం...ఖాతాలో పడడం ఖాయం. విచిత్రమో...అదృష్టమో...అధికారుల మాయో తెలియదు కాని...అక్షరాల రూ.40 లక్షల చెక్కు, పనికి ముందే ఆ కాంట్రాక్టర్ పేరిట రెడీ అయిపోయింది.
రూ.40లక్షల పని..
నగరంలోని బొమ్మకల్ ఫ్లై ఓవర్‌కు సుందరీకరణలో భాగంగా పెయింటింగ్ వేసేందుకు నగరపాలకసంస్థ నిర్ణయించింది. స్పర్స్ ఐఈసీ నిధులతో చారిత్రాత్మక చిత్రాలు, స్వచ్ఛతపై అవగాహన కల్పించే చిత్రాలను ఈ ఫ్లై ఓవర్‌పై వేయాల్సి ఉంటుంది. రూ.40 లక్షల విలువైన పనికి సంబంధించి రూ.5 లక్షల చొప్పున ఎనిమిది బిట్లుగా విభజించి నామినేషన్ పద్ధతిన కాంట్రాక్ట్ అప్పగించినట్లు సమాచారం. కాగా సదరు కాంట్రాక్టర్ పెయింటింగ్ పనులు మొదలు పెట్టకముందే ఆయన చేసిన(చేయని) పనికి బిల్లు కూడా రెడీ అయిపోయింది. రూ.40 లక్షల విలువైన చెక్కు జారీ అయింది. అది నగదుగా మారడమే మిగిలింది.
నిధులు ల్యాప్స్ అవుతాయట..
స్పర్స్ ఐఈసీ నిధులతో రూ.40 లక్షల విలువైన పెయింటింగ్ పనులు చేపట్టారు. ఈ నిధులు గత ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించాల్సి ఉంది. దీంతో మార్చి 31వ తేదీ తరువాత ల్యాప్స్ అయిపోతాయానే ఉద్దేశంతో కాంట్రాక్టర్ పేరిట ముందే చెక్ రెడీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 31వ తేదీలోపు ఈ నిధులను వినియోగించాల్సి ఉన్నప్పుడు, అందుకు తగినట్లుగా ముందే ఎందుకు పనులు పూర్తి చేయలేకపోయారో అధికారులు చెప్పలేకపోతున్నారు. నిధుల గడువు ముగిసిపోతుందని హడావుడిగా నామినేషన్ పద్ధతిన కాంట్రాక్ట్ అప్పగించడం, పనులు మొదలు పెట్టకముందే బిల్లు సిద్ధం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ పనులు అనుకున్న రీతిలో చేయకపోయినా బిల్లు మాత్రం చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా పనులు మొదలు పెట్టకున్నా చెక్కు రెడీ కావడం పట్ల బల్దియా వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
పనులు పూర్తయ్యాకే బిల్లు ఇస్తాం
బొమ్మకల్ ఫ్లై ఓవర్ పెయింటింగ్ పనికి సంబంధించిన బిల్లు కాంట్రాక్టర్‌కు చెల్లించలేదు. నిధుల గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తున్నందున ఆ డబ్బులు విడుదల చేయాల్సి వ చ్చింది. చెక్ మాత్రమే రెడీ చేశాం. డబ్బులు నగరపాలకసంస్థ వద్దనే ఉన్నాయి. పనులు పూ ర్తయ్యాకే బిల్లు చెల్లిస్తాం. – చాహత్ బాజ్‌పేయ్,
కమిషనర్ నగరపాలకసంస్థ


