శుక్రవారం సభలో సమస్యలు పరిష్కారం
● జిల్లా సంక్షేమ అధికారి సబిత
కరీంనగర్‌రూరల్: మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శుక్రవారం సభ వేదికగా నిలుస్తుందని జిల్లా సంక్షేమ అధికారి సబిత అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ మండలం జూబ్లీనగర్‌లో శుక్రవారం సభను నిర్వహించారు. మహిళలు తమ సమస్యలు తెలిపితే పరిష్కరించే అవకాశముందన్నారు. గర్భిణిలు, బాలింతలు, మహిళలు తప్పనిసరిగా సభకు హాజరు కావాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వెంకట రమణ మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో 50 రకాల వైద్యపరీక్షలను మహిళలకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అంగన్‌వాడీలోని చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంజీవరావు, డీఐవో సాజీదా, ఎంఈవో రవీందర్, వైద్యాధికారి మనోహర్, ఐసీడీఎస్ సూపర్‌వైజరు నిర్మల, డీపీఏ రోమిలా,బీసీ సతీష్, సఖి సెంటర్ ఇన్‌చార్జి లక్ష్మి, చైల్డ్‌లైన్ సంపత్, ప్రధానోపాధ్యాయురాలు జలజరాణి, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, అంగన్‌వాడీ టీచరు స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.
పత్తి మార్కెట్‌కు మూడురోజులు సెలవు
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తిమార్కెట్‌కు శని, ఆది, సోమవారం సెలవు ఉంటుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజాలు తెలిపారు. శుక్రవారం క్వింటాల్ పత్తి రూ.7,650 పలికిందని వివరించారు. తిరిగి మంగళవారం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
నేడు మద్యం దుకాణాలు బంద్: సీపీ
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈనెల 12న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్‌షాపులు, బార్లు, క్లబ్, మద్యం డిపోలు మూసివేస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మూసివేస్తున్నట్లు ప్ర కటించారు.ఆదేశాలను ఎవరైన ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగరాజు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ బార్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గానికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా లింగంపల్లి నాగరాజు, ఉపాధ్యక్షుడిగా చందా రమేశ్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి కాసుగంటి మాధవరావు ప్రకటించారు. సంయుక్త కార్యదర్శిగా సిరికొండ శ్రీధర్‌రావు, ట్రెజరర్‌గా సంపత్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా గుగులోతు బలరాం, లైబ్రరీ సెక్రటరీగా తుమ్మ ప్రభాకర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వెన్న ఆనందం, సందూరి భూమిరెడ్డి, గుంటి మధు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కోల ప్రభాకర్, కొలిపాక ప్రియాంక, సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేసిన వారిలో అరుణ్ కుమార్‌కు 222 ఓట్లు రాగా, చంద్రపాటి కిరణ్ కుమార్‌కు 221 వచ్చాయి. దీంతో కిరణ్‌కుమార్ రీకౌంటింగ్ చేయాలని కోరడంతో ఓట్లు మళ్లీ లెక్కిస్తున్నారు. ఫలితం వచ్చేవరకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో మొత్తం 859 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
శుక్రవారం సభలో సమస్యలు పరిష్కారం


