కారా? కమలమా? | - | Sakshi
Sakshi News home page

కారా? కమలమా?

Apr 12 2025 2:20 AM | Updated on Apr 12 2025 2:20 AM

కారా? కమలమా?

కారా? కమలమా?

● క్లియరెన్స్‌ వస్తే పార్టీ జంప్‌ ● కాంగ్రెస్‌కు మాజీ కార్పొరేటర్లు గుడ్‌బై?

కరీంనగర్‌ కార్పొరేషన్‌: గత పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన పలువురు మాజీ కార్పొరేటర్లు పక్క చూపులు చూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై నారాజుతో ఉన్న వీళ్లలో కొందరు పార్టీని వీడేందుకు సమాయత్తమవుతున్నారు. నగరపాలకసంస్థ ఎన్నికలకు ముందుగానే బెర్త్‌ ఖాయం చేసుకునేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలతో టచ్‌లో ఉంటున్నారు.

కాంగ్రెస్‌పై నారాజ్‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గత పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా 11 మంది అప్పటి కార్పొరేటర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామాచేసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మూడు రంగుల జెండా అందుకున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీగా నగరపాలకసంస్థలో ఆధిపత్యం తమదే అనుకున్న సదరు కార్పొరేటర్ల భ్రమలు కొద్దిరోజుల్లోనే తొలగిపోయాయి. పాలకవర్గం ముగిసి ప్రత్యేకాధికారి పాలనలోనూ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పార్టీ నాయకత్వం తమను పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. పైగా కరీంనగర్‌ పార్టీలో ఉన్న వర్గపోరు మాజీ కార్పొరేటర్లను మరింత ఇబ్బందికి గురిచేసింది. తాము అనుకున్నది జరగకపోవడం, పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం, భవిష్యత్‌పై బెంగ.. తదితర కారణాలతో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. 11 మందిలో కనీసం సగం మంది కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ను వీడడం ఖాయమని, బీజేపీలోకి వెళ్లాలని తమ డివిజన్‌ వాసులు ఒత్తిడి తెస్తున్నారని ఓ మాజీ కార్పొరేటర్‌ ‘సాక్షి’ కి వెల్లడించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

క్లియరెన్స్‌ వస్తే...

కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమైన మాజీ కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌, బీజేపీలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కొంతమంది బీఆర్‌ఎస్‌, మరికొంత మంది బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమకు టికెట్‌లపై భరోసా ఇచ్చే పార్టీలోకి చేరేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు ఈ మేరకు మాజీ కార్పొరేటర్లు ప్రతిపాదనలు పెట్టగా, ఇప్పట్లో ఎన్నికలు లేవు కదా వచ్చాక చూద్దామని వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా ఒకప్పటి సహచర కార్పొరేటర్‌ అయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వైపు మరికొంతమంది మొగ్గు చూపుతున్నారు. పాత పరిచయాలతో తమకు ప్రాధాన్యం ఉంటుందని, నగరంలో బీజేపీ పుంజుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనతో కాషాయ నేతలతోనూ టచ్‌లో ఉన్నారు. నగర రాజకీయాల్లో ఆరితేరిన ఈ ఇద్దరు నేతల్లో ఎవరు క్లియరెన్స్‌ ఇస్తే ఆ పార్టీలో చేరేందుకు మాజీ కార్పొరేటర్లు రంగం సిద్ధం చేసుకొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement