సన్నబియ్యం.. నో స్టాక్
● అరకొర కేటాయింపుతో డీలర్ల అవస్థలు ● రేషన్ దుకాణాల వద్ద కార్డుదారుల ఆగ్రహం ● సగానికి పైగా దుకాణాలు మూత ● నత్తనడకన బియ్యం సరఫరా
నగరంలోని వావిలాలపల్లిలోని రేషన్ దుకాణం ఇది. కార్డుల సంఖ్యకు అనుగుణంగా సన్నబియ్యం సరఫరా చేయాల్సి ఉండగా పావువంతు స్టాక్ పంపించారు. ఒక్కరోజులోనే పంపిణీ పూర్తవగా బియ్యం లేక రేషన్ దుకాణాన్ని మూసివేశారు. కార్డుదారులు రావడం, పడిగాపులు కాయడం పరిపాటిగా మారింది.
జిల్లాలో గ్రామాలు: 313
మొత్తం జనాభా: 10,09,234
రేషన్ కార్డులు: 2,74,620
యూనిట్లు: 8,17,156
రేషన్ దుకాణాలు: 566
కరీంనగర్ అర్బన్: సన్నబియ్యం అంతలోనే స్టాక్ అయిపోయాయి. అలా వచ్చాయో లేదో ఇలా పంపిణీ చేసేశారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి అరకొర కేటాయింపులే సదరు పరిస్థితికి కారణం కాగా పూర్తిస్థాయిలో మూవ్‌మెంట్ కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించగా కార్డుదారులు ఆశగా రేషన్ దుకాణాలను ఆశ్రయిస్తుండగా తీరా బియ్యం అయిపోయాయి.. వస్తాయనే సమాధానంతో నిరీక్షిస్తున్నారు. జిల్లాలో 566 రేషన్ దుకాణాలుండగా 2.74 లక్షల మంది కార్డుదారులున్నారు. ఇప్పటివరకు 30శాతం బియ్యం మాత్రమే దుకాణాలకు చేరగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితని తెలుస్తోంది.
ఇదేం చోద్యం.. పంపిణీకి జాప్యం
ప్రభుత్వం స్టేజ్–1, స్టేజ్–2 ద్వారా బియ్యం సరఫరా చేస్తుండగా లోపాలను సరిదిద్దాల్సిన జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోంది. దీంతో ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జీలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తమకు ఇష్టం లేకు న్నా విధులు కేటాయించారంటూ కూలీలతో నిష్టూ రమాడటం ఆశ్చర్యపరుస్తోంది. జిల్లాలో 2.74లక్షల కార్డుదారులుండగా 8లక్షలకు పైగా యూనిట్లున్నాయి. స్టేజ్–1 నుంచి సకాలంలో బియ్యం రాకపోవడం వల్లే ఈ సమస్య అని ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జీలు చెబుతుండగా తాము అలాట్‌మెంట్ ప్రకారం బియ్యం అందిస్తున్నామని అయినా తమపై ఆరోపణలేంటని స్టేజ్–1 గుత్తేదారులు మండిపడుతున్నారు.
పాపం.. రేషన్ డీలర్లు, కార్డుదారులు
రేషన్ దుకాణాలకు బియ్యం ఆలస్యంగా వస్తుండటంతో డీలర్ల బాధ వర్ణనాతీతం. కొంత బియ్యం ఒకసారి మరికొంత బియ్యం మరోసారి పంపిస్తుండటంతో సాధ్యమైనంత వరకు పంపిణీ చేస్తున్నా పూర్తిస్థాయిలో జరగడం లేదు. దీంతో కమిషన్‌తోనే బతుకు వెళ్లదీయాల్సిన డీలర్లు గిట్టుబాటు కాక ఉస్సూరుమంటున్నారు. ఇక కార్డుదారులు బియ్యం కోసం రేషన్ దుకాణాలకు చుట్టూ తిరుగుతున్నారు.
ఇబ్బంది పడుతున్నాం
సరైన పణాళిక లేకపోవడంతో డీలర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 1వ తేదీలోపే బియ్యం మూవ్‌మెంట్ కావాల్సి ఉండగా ఇప్పటికి సాగుతోంది. వచ్చిన బియ్యాన్ని వచ్చినట్లే పంపిణీ చేస్తున్నా స్టాక్ లేక రోజుల తరబడి ఖాళీ ఉంటున్నం. ఉన్నతాధికారులు చొరవ చూపి ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలి. – రొడ్డ శ్రీనివాస్,
తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
సన్నబియ్యం.. నో స్టాక్


