అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Published Sat, May 18 2024 5:50 AM

అనుమా

వేములవాడఅర్బన్‌: వేములవాడ మండలం ఎదురుగట్లకు చెందిన పొన్నం మణెవ్వ–నర్సయ్య దంపతుల కుమార్తె పొన్నం కవిత(36) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు. కవిత మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ఫిట్స్‌ కూడా వస్తుంటాయి. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆమె శుక్రవారం వేములవాడ మున్సిపల్‌ పరిధి నాంపల్లి శివారులో మృతిచెంది కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ పరిశీలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరుచోట్ల ఆటోలు బోల్తా..

ఇద్దరి మృతి

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): ఇదులాపూర్‌ – పెద్దరాతుపల్లి గ్రామాల మధ్య గురువారం రాత్రి మట్టలవాగు కల్వర్టుపై ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందగా మరొకరు గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి బీస రజిత.. చెలుకాని రాజు ఆటో అద్దెకు తీసుకుని కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఇదులాపూర్‌లో జరిగే వారసంతకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఇదులాపూర్‌ – పెద్దరాతుపల్లి మధ్య ఆటో ప్రమాదవాశాత్తు మట్టలవాగుపై బోల్తాపడింది. ఈప్రమాదంలో ఆటో నడుపుతున్న రాజు(30) అక్కడికక్కడే మృతి చెందాడు. బీస రజితకు గాయాలయ్యాయి. బైక్‌పై అటుగా వెళ్తున్న నెట్టం కిరణ్‌ ఇందుర్తి గ్రామ సర్పంచ్‌కు ఫోన్‌ద్వారా సమాచారం తెలిపాడు. కుటుంబ సభ్యులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనం ద్వారా రాజు మృతదేహాన్ని, రజితను సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రజిత కోలుకుంటోంది. రాజు భార్య భవాని శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై ఓంకార్‌ యాదవ్‌ తెలిపారు. మృతుడికి భార్య భవాని, కూతురు, కుమారుడు ఉన్నారు.

పాలితం గ్రామం వద్ద..

పెద్దపల్లిరూరల్‌: పాలితం గ్రామం వద్ద శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తాపడ్డ ఘటనలో ఆలేటి భూమయ్య(42) మృతిచెందినట్లు ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే భూమయ్య.. పెద్దపల్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అదుపు తప్పి ఆటో నడుపుతున్న భూమయ్యపైనే బోల్తాపడింది. గాయాలు కావడంతో వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య జయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

చికిత్స పొందుతూ దివ్యాంగురాలు..

పట్టణ శివారు చందపల్లికి చెందిన కొండి స్వరూప(42) అనే దివ్యాంగురాలు చికిత్స పొందుతూ మృతి చెందిందని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. రెండురోజుల బీపీ అధికం కావడంతో కిందపడి గాయపడ్డ స్వరూపను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించిందని ఎస్సై తెలిపారు.

గుండెపోటుతో రంగస్థల నటుడు..

హుజూరాబాద్‌ రూరల్‌: మండలంలోని పెద్దపాపయ్యపల్లికి చెందిన రంగస్థల నటుడు, సీనియర్‌ కళాకారుడు పోరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి(68) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన గ్రామంలో మొట్టమొదట శివరామకృష్ణ భజన మండలిని స్థాపించి, ఎంతోమంది కళాకారులను తయారు చేశారు. హైదరాబాద్‌లో నటరాజ కళాకారుల సంక్షేమ సంఘాన్ని స్థాపించి, అధ్యక్షుడిగా పని చేశారు. శ్రీనివాస్‌రెడ్డి రంగస్థల కళాకారుడిగా రాష్ట్రస్థాయిలో పేరు పొందారు. ప్రభుత్వ కార్యక్రమాలైన అక్షర ఉజ్వల, నిరక్షరాస్యత, మూఢనమ్మకాల నిర్మూలనపై నాటకాలతో ప్రజల్లో చైతన్యం కలిగించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మృతికి గ్రామంలోని ప్రజాప్రతినిధులు, రంగస్థల కళాకారులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
1/1

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Advertisement
 
Advertisement
 
Advertisement