సద్వినియోగం చేసుకోవాలి
నెలముందు ఏర్పాటు చేయాల్సింది
బాన్సువాడ రూరల్: అన్నదాతలకు వ్యవసాయ రంగంలో సలహాలు సూచనలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు వేదికలు.. విత్తన విక్రయ కేంద్రాలుగా మారనున్నాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి వారం పాటు విత్తన మేళాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలోని 104 క్టస్టర్ రైతువేదికల్లో ఏర్పాట్లు చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సహకార సంఘాలు, వివిధ విత్తన కంపెనీలతో పాటు స్థానిక విత్తన డీలర్ల ఆధ్వర్యంలో స్టాల్స్ నిర్వహించనున్నారు. ఇందులో బోనస్ అందించే ఏడు రకాల వరి వంగడాలతోపాటు యూరియాను అందుబాటులో ఉంచనున్నారు.
స్టాల్స్‌లో అందుబాటులో ఉండేవి..
రైతువేదికలో ఏర్పాటు చేసే స్టాల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించి ఏడు వరి వంగడాలతో పాటు, పేరున్న సంస్థలకు చెందిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వం బోనస్ అందించే బీపీటీ –5204, ఆర్‌ఎన్‌ఆర్ –15048, జైశ్రీరాం, హెచ్‌ఎంటీ, కేఎన్‌ఎం – 1638, డబ్ల్యూజీఎల్–44(సిద్ది), డబ్ల్యూజీఎల్–962 వరి వంగడాలతోపాటు పెసర, కంది, మినుము, వేరుశనగ, నువ్వులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలను విక్రయిస్తారు. నానోయూరియా, నానో డీఏపీ సైతం అందుబాటులో ఉంచడానికి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశాయిపేట్‌లోని రైతువేదిక
ప్రభుత్వమే చొరవ తీసుకుని విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతోంది. దీంతో నకిలీల బాధ తప్పుతుంది. సరసమైన ధరలకే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. రైతులు రైతు వేదికలను సందర్శించి, విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి.
– మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
చాలాగ్రామాల్లో రైతులు ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకున్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద బోరుబావులు ఉన్న రైతులు ఇప్పటికే వరినాట్లు ప్రారంభించారు. వ్యవసాయశాఖ తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా నెలరోజుల ముందు స్టాల్స్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. ఇకపై పంట కొనుగోళ్లు పూర్తికాగానే స్టాల్స్ ఏర్పాటు చేయాలి. – కస్ప హన్మండ్లు, రైతు, బోర్లం
రైతువేదికల్లో స్టాళ్ల ఏర్పాటు
అందుబాటులో బోనస్ వర్తించే
వరివంగడాలు, యూరియా
ముందే ఏర్పాటు చేస్తే
బాగుండేదంటున్న రైతులు


