● హౌసింగ్ బోర్డు శ్మశానవాటికలో సర్వే
● ‘మహాప్రస్థానం’లా తీర్చిదిద్దుతామంటున్న
ఎస్‌ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు
కామారెడ్డి టౌన్ : పట్టణంలోని హౌసింగ్ బోర్డులోగల హిందూ శ్మశాన వాటికను ’మహాప్రస్థానం’ తరహాలో అభివృద్ధి చేసేందుకు మరో అడుగు పడింది. ‘ఎస్‌ఆర్ ఫౌండేషన్’ ప్రతినిధులు సోమవారం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు.
వైకుంఠధామంలో సరైన సౌకర్యాలు లేక అంతిమ సంస్కారాలు చేసేందుకు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రిక ఏప్రిల్ 20న ‘అంతిమ కష్టం’ శీర్షికన కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై బీబీపేట మండలం జనగామకు చెందిన ఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి స్పందించి శ్మశానవాటికను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు ఇటీవల మున్సిపాలిటీ పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఫౌండేషన్ ప్రతినిధులు శ్మశాన వాటికలో అందుబాటులో ఉన్న స్థలం, ప్రభుత్వ భూమి వివరాలను సర్వే చేయించారు. రూ. 4 కోట్లతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలా తీర్చిదిద్దుతామని, ఇక్కడ చేపట్టే పూర్తి స్థాయి ఆధునికీకరణ పనుల కోసం ప్రత్యేక డిజైన్ రూపొందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సర్వేలో ఎస్‌ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట్‌గౌడ్, మట్ల శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, రాజాగౌడ్, అశోక్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


