● టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని రెండు హిందూ శ్మశానవాటికలను స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని హిందూ శ్మశానవాటిక అభివృద్ధి కోసం ఎస్‌ఆర్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని, ఇందుకు మున్సిపాలిటీ నుంచి పూర్తి అనుమతులు లభించాయన్నారు. సోమవారం నుంచి ఫౌండేషన్ ప్రతినిధులు స్థల పరిశీలన ప్రారంభించారని, గదుల నిర్మాణంతో పాటు పూర్తి స్థాయి అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇందిరానగర్ శ్మశానవాటిక అభివృద్ధికి మరో రెండు స్వచ్ఛంద సంస్థలు అంగీకరించాయని తెలిపారు.
పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం..
కామారెడ్డి కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సూచించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాల మేరకే ఉమ్మడిగా ముందుకెళ్తామన్నారు. పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మ విజయకుమార్ రెడ్డి, సబ్బని హరికృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, కాంగ్రెస్ నాయకులు ప్రసాద్, సలీం, రంగ రమేష్ గౌడ్, పిడుగు సాయిబాబా, శంకర్‌రావు, జమీల్, రవీందర్, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


