భరోసా ఎంత? | - | Sakshi
Sakshi News home page

భరోసా ఎంత?

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

భరోసా ఎంత? స్పష్టత రావాల్సి ఉంది వడ్డీ వ్యాపారులే దిక్కు!

దేశానికి అన్నం పెట్టే రైతు విషయంలో పాలకులు చిన్నచూపు చూస్తున్నారు. పెట్టుబడి సాయం అందించే విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో ఏటా రెండు విడతల్లో అన్ని ఎకరాలకూ అందించిన సాయం విషయంలో ప్రస్తుతం నీలినీడలు అలుముకున్నాయి. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అందుతుందో తెలియక పంటలకు అవసరమైన పెట్టుబడుల కోసం అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – కామారెడ్డి క్రైం

యాసంగి సీజన్‌లో రెండెకరాలకే అందిన సాయం

పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. మొదట్లో రెండు విడతల్లో కలిపి ఎకరాకు రూ. 8 వేలచొప్పున అందరు రైతులకు పెట్టుబడి సాయం అందించారు. తర్వాత దానిని రూ. 10 వేలకు పెంచారు. ఏటా రెండు విడుతల్లో రైతులకు రైతుబంధు అందింది. అయితే పెట్టుబడి సాయాన్ని రూ. 15 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీ అమలులో చేతులెత్తేసింది. పథకం పేరును రైతు భరోసా మార్చి ఎకరాకు రూ. 12 వేల చొప్పున మాత్రమే అందిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సీజన్‌లో పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదు.

ఈసారి అందరికీ అందేనా?

జిల్లాలో మొత్తం 3,32,611 మంది రైతులున్నారు. పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకం అమలు చేయడానికి రూ. 316.53 కోట్ల నిధులు అవసరం ఉంటాయి. గత ఖరీఫ్‌లో అందరు రైతులకు పెట్టుబడి సాయం అందించిన సర్కారు.. రబీకి వచ్చేసరికి రెండెకరాలకే పరిమితం చేసింది. అదీ సీజన్‌ పూర్తయిన తర్వాత అందించడం గమనార్హం. రబీలో 3,09,281 మంది రైతులకుగాను రూ.220.28 కోట్ల పెట్టుబడి సాయం అందింది. ఈసారి వానాకాలం సీజన్‌కు సంబంధించిన నిధులను నెలాఖరునుంచి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్ని విడతలలో, ఎన్ని ఎకరాలకు ఇస్తారో మాత్రం చెప్పలేదు. మళ్లీ ఒకటి, రెండు ఎకరాలకు వేసి చేతులెత్తేస్తారా, పూర్తి స్థాయిలో అమలు చేస్తారా అనే సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి.

రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఎన్ని ఎకరాలకు ఎన్ని విడతలలో అందిస్తారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పెట్టుబడి సాయం అందుతుంది.

– మోహన్‌రెడ్డి, డీఏవో, కామారెడ్డి

తంలో పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. రైతుబంధు పథకం వచ్చాక చాలావరకు అప్పులు చేయడం తగ్గింది. కానీ పథకాన్ని అమలు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా మళ్లీ రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. గతేడాది భారీ వర్షాలు, వరదలకు చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆశించిన దిగుబడులు రాలేదు. రబీలో చాలామందికి ధాన్యం, మక్కలు, జొన్నలు విక్రయించిన డబ్బులు ఇంకా పడలేదు. దీంతో పెట్టుబడులకు చేతిలో పైసలు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుభరోసాకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.

నెలాఖరున ఖరీఫ్‌ నిధులు విడుదల చేస్తామన్న సర్కారు

విడతలు, పరిమితిపై స్పష్టత కరువు

పెట్టుబడులకోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి

ఆందోళనలో అన్నదాతలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement