● రూ.1.93 కోట్లు విలువైన
3.87 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
● ముగ్గురు నిందితుల రిమాండ్
● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: రాష్ట్రాలు దాటి అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. రూ.1.93 కోట్లు విలువైన 3.87 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి కామారెడ్డి మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ శ్రీధర్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, బీబీపేట ఎస్సై విజయ్, పిట్లం ఎస్సై ఆంజనేయులు, మాచారెడ్డి ఎస్సై అనిల్, సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్, సిబ్బందితో కూడిన ఐదు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి శనివారం రాత్రి తనిఖీలు ప్రారంభించారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై క్యాసంపల్లి శివారులో తనిఖీ చేస్తుండగా.. ఓ వ్యాన్‌లో పనస పండ్ల కింద దాచి ఉంచిన గంజాయిని గుర్తించారు. వాహనం పైభాగంలో పనసపండ్లు ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా వాటి కింద సంచుల్లో భారీ మొత్తంలో నిషేధిత గంజాయిని ఉంచారు. దీంతో పోలీసులు వాహనంలో ఉన్న మొత్తం 387.128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 1.93 కోట్లు ఉంటుందని ఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిని నిజామాబాద్‌కు చెందిన షేక్ కరీముల్లా, గైని సుభాష్, షేక్ రహీమ్‌గా గుర్తించామన్నారు. పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకున్న పోలీసు అధికారులను అభినందించారు.


